Ramcharan: కేరళలో రామ్ చరణ్ మేనియా మామూలుగా లేదు... మలయాళ సీమలో 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

  • తిరువనంతపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • రామ్ చరణ్ అభిమానుల కోలాహలం
  • జై చరణ్ నినాదాలతో హోరెత్తించిన వైనం
  • కేరళ సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీ
Ram Charan mania in Kerala

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హిందీ, తమిళంలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు నిర్వహించారు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో నేడు ఆర్ఆర్ఆర్ మలయాళ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, నిర్మాత డీవీవీ దానయ్య విచ్చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రామ్ చరణ్ మేనియా స్పష్టంగా కనిపించింది నగర వీధుల్లో మెగా అభిమానులు రామ్ చరణ్ పోస్టర్లు ప్రదర్శించారు. కేరళ సంప్రదాయ వాయిద్యాల నడుమ చరణ్ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా "జై చరణ్" నినాదాలు మిన్నంటాయి.

ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో "హలో కేరళ" అంటూ రామ్ చరణ్ తన ప్రసంగం ప్రారంభించడం మొదలు అభిమానులు ఈలలు, చప్పట్లతో హోరెత్తించారు. కాగా, చరణ్ మాట్లాడుతూ, కేరళలో ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేస్తున్న నిర్మాత షిబూకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చిత్రం ద్వారా భారీగా ఆదాయం పొందాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రం చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేరళ యువ నటుడు టొవినో థామస్ కు చెర్రీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇక తన మిత్రుడు ఎన్టీఆర్ గురించి చెబుతూ, ఎన్టీఆర్ తనలో సగభాగం లాంటివాడని, ఆ సగభాగం లేకుండా ఆర్ఆర్ఆర్ సినిమా లేదని పేర్కొన్నారు. దేవుడి సొంత దేశం వంటి కేరళలో మంచి సినిమాలు వస్తుంటాయని, ఆ సినిమాలకు తామందరం అభిమానులమని వివరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కేరళ అభిమానుల ఆదరణ కూడా కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.



More Telugu News