Narendra Modi: ప్రధాని మోదీ కొత్త కారు ధరను మీడియాలో ఎక్కువ చేసి చూపించారు: కేంద్రం వర్గాలు

  • ప్రధాని కోసం మెర్సిడెస్ మేబాక్ కారు
  • భద్రతాపరంగా కారులో అత్యాధునిక ఫీచర్లు
  • ధర రూ.12 కోట్లు అంటూ మీడియాలో కథనాలు
  • మూడింట ఒక వంతు ధర ఉంటుందన్న కేంద్రం
Centre sources says PM Modi new car price much less than as media mentioned

ప్రధాని నరేంద్ర మోదీ కోసం కొత్తగా మెర్సిడెస్ మేబాక్ ఎస్-650 గార్డ్ కారును కేంద్రం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. భద్రతాపరంగా తిరుగులేని ప్రమాణాలు ఈ కారు సొంతం. అయితే ఈ కారు ధరను మీడియాలో రూ.12 కోట్లుగా పేర్కొన్నారు. ఇది తప్పు అని కేంద్రం వర్గాలు స్పందించాయి.

ప్రధాని కొత్త కారు ధరను మీడియాలో ఎక్కువ చేసి చూపించారని ఆరోపించాయి. మీడియా పేర్కొన్న దాని కంటే ఆ కారు ధర తక్కువేనని స్పష్టం చేశాయి. మీడియాలో చూపించిన ధరలో మూడింట ఒక వంతు ఉంటుందని పేర్కొన్నాయి.

ప్రధాని మోదీ గతంలో బీఎండబ్ల్యూ కారు ఉపయోగించారని, అయితే ఆ మోడల్ కార్ల తయారీని బీఎండబ్ల్యూ నిలిపివేయడంతో, ప్రధాని కోసం మెర్సిడెస్ కొనుగోలు చేసినట్టు వివరించాయి. అత్యున్నత స్థాయి ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ ప్రమాణాల ప్రకారం ప్రధాని ఓ కారును ఆరేళ్లకు మించి ఉపయోగించరాదని కేంద్రం వర్గాలు వెల్లడించాయి.

అయితే మోదీ ఓ కారును ఎనిమిదేళ్లు ఉపయోగించగా, దానిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని వివరించాయి. ప్రమాణాలకు అనుగుణంగా వ్యవహరించకపోతే, రక్షణ కల్పించాల్సిన వ్యక్తి భద్రతపై రాజీపడడమేనంటూ విమర్శలు వచ్చాయని, అందుకే ప్రధాని కోసం కొత్త కార్లు కొనుగోలు చేసినట్టు తెలిపాయి.

ఫలానా కారునే కొనుగోలు చేయాలంటూ ప్రధాని మోదీ ఎలాంటి సూచనలు చేయలేదని సదరు వర్గాలు స్పష్టం చేశాయి.

More Telugu News