anandaiah: నేను పంపిణీ చేస్తున్న‌ది ఒమిక్రాన్ మందు కాదు: ఆనంద‌య్య‌ వివరణ

  • నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గంద‌ర‌గోళం
  • ఆనంద‌య్య మందు పంపిణీ చేయ‌కూడ‌ద‌ని గ్రామ‌స్థుల ఆందోళ‌న‌
  • ఇప్ప‌టికే జాయింట్ క‌లెక్ట‌ర్ నోటీసులు
  • మందు పంపిణీ ఆపేసిన ఆనంద‌య్య‌
  • అది రోగ నిరోధ‌క మంద‌ని వివ‌ర‌ణ‌
anandaiah on omicron medicine

దేశంలో కరోనా విజృంభ‌ణ స‌మ‌యంలో ఆ వైర‌స్‌కు మందు త‌యారుచేసి పంపిణీ చేసిన‌ నాటు వైద్యుడు ఆనందయ్య, ఇప్పుడు ఒమిక్రాన్‌కు కూడా మందు ఇస్తున్నట్టు ప్ర‌చారం జరుగుతోంది. ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్‌ చెబుతోంది.

మరోవైపు, మందు పంపిణీ చేయకూడ‌ద‌ని కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. ఎందుకంటే రోగులు ఆ మందు కోసం వస్తే జ‌న సంచారం పెరిగి తమకు కూడా కరోనా అంటుకుంటుంద‌ని భ‌య‌ప‌డుతున్నారు. దాంతో ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు.

ఈ నేప‌థ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో గంద‌ర‌గోళం ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఆనందయ్య వ్యవహారంపై ఇప్ప‌టికే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆనందయ్యకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశ్‌ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని ఆయ‌న‌ కోరారు. ఆ మందు పంపిణీ చేసేందుకు ఏయే అనుమతులు తీసుకున్నారో తెల‌పాల‌ని ఆదేశించారు.

ఒక‌వేళ‌ అనుమతులు లేకుండా మందు పంపిణీ చేస్తున్న‌ట్ల‌యితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చ‌రించారు. ఈ విష‌యంపై వారం రోజుల్లోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన ఆనందయ్య మీడియాకు వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను ఒమిక్రాన్‌ కోసం మందు త‌యారు చేశాన‌ని ఎక్క‌డా చెప్పలేదని అన్నారు. తన మందు ఏ వ్యాధికైనా రోగ‌నిరోధ‌క‌త‌ను పెంచుతుందని, ఆ విష‌యాన్నే చెబుతున్నాన‌ని ఆయ‌న తెలిపారు.

త‌న‌కు జాయింట్‌ కలెక్టర్ నుంచి అందిన‌ నోటీసుల‌కు పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని ఆయన అన్నారు. ఈ మందును తాను ఉచితంగానే ప్ర‌జ‌ల‌కు ఇస్తున్నానని చెప్పారు. అయితే, ఈ మందు ఇస్తున్నందుకు త‌న‌కు వ్య‌తిరేకంగా త‌మ‌ గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం బాధాకరమని ఆయన ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే అధికారుల ఆదేశాలతో తాను ఆ మందు పంపిణీని నిలిపేశానని ఆయ‌న చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

More Telugu News