health insurance: ముందు నుంచీ ఉన్న వ్యాధులను చూపించి క్లెయిమ్ తిరస్కరిస్తే కుదరదు: మెడిక్లెయిం పాలసీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు

  • పాలసీదారుకు తెలియాలని లేదు
  • ఉన్నట్టుండి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందనే పాలసీ తీసుకుంటారు
  • అన్ని వివరాలు వెల్లడించలేదని పరిహారం తిరస్కరించరాదు
  • ప్రపోజర్ తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడన్న   సుప్రీంకోర్టు 
Insurer Cant Refuse Claim Supreme Court ordered

పాలసీదారులకు ఊరటనిచ్చే విధంగా ఓ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. ఒక్కసారి పాలసీ జారీ చేసిన తర్వాత.. ముందు నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలకు క్లెయిమ్ తిరస్కరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది.

‘‘ప్రపోజర్ (పాలసీ తీసుకునేవారు) బీమాకు సంబంధించి అన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. తనకు తెలిసిన అన్ని సమస్యల గురించి బీమా సంస్థకు తెలియజేయాల్సిన బాధ్యత తీసుకునే వారిపై ఉంటుంది. అయితే ప్రపోజర్ తనకు తెలిసిన వాటినే వెల్లడించగలడు. ఒక్కసారి పాలసీ జారీ చేయడం పూర్తయితే.. బీమా సంస్థ ముందు నుంచి ఉన్న సమస్య అంటూ క్లెయిమ్ ను తిరస్కరించరాదు’’ అని ధర్మాసనం పేర్కొంది.

మన్మోహన్ నందా అనే వ్యక్తికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. అమెరికా వెళుతూ ఆయన ఓవర్సీస్ మెడిక్లెయిమ్ పాలసీ తీసుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయం చేరుకున్న తర్వాత హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుండె రక్తనాళాలు పూడుకుపోయినట్టు గుర్తించి స్టెంట్లు వేశారు.

నందా క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడికి హైపర్ లిపిడేమియా, మధుమేహం సమస్యలు ఉన్నాయని, స్టాటిన్ మాత్రలు వాడుతున్నా కానీ పాలసీ కొనుగోలు చేసే సమయంలో వెల్లడించలేదని బీమా సంస్థ క్లెయిమ్ ను తిరస్కరించింది. వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లోనూ పాలసీదారుకు వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం సాధించాడు. ఉన్నట్టుండి అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరాల్సి వస్తే రక్షణ కోసమే పాలసీ తీసుకుంటారన్న సూక్ష్మ అంశాన్ని కోర్టు గుర్తు చేసింది.

More Telugu News