Shami: షమీకి 5 వికెట్లు... దక్షిణాఫ్రికా 197 ఆలౌట్

  • సెంచురియన్ లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 327 ఆలౌట్
  • ఎంగిడికి 6 వికెట్లు
  • తొలి ఇన్నింగ్స్ లో తడబడిన సఫారీలు
  • కకావికలం చేసిన షమీ, బుమ్రా
Shami bags five wickets in South Africa first innings

సెంచురియన్ టెస్టులో భారత్ కు కీలకమైన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు ఆలౌట్ కాగా, బదులుగా దక్షిణాఫ్రికా కేవలం 197 పరుగులే చేసింది. తద్వారా భారత్ కు 130 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. టీమిండియా పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లు సాధించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచాడు. షమీ ఈ 5 వికెట్ల ప్రదర్శన ద్వారా టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. బుమ్రాకు 2, శార్దూల్ ఠాకూర్ కు 2, సిరాజ్ కు 1 వికెట్ లభించాయి.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో 52 పరుగులతో టెంబా బవుమా టాప్ స్కోరర్ గా నిలిచాడు. డికాక్ 34 పరుగులు చేయగా, లోయరార్డర్ లో రబాడా 25, మార్కో జాన్సెన్ 19 పరుగులు చేశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ వికెట్ చేజార్చుకుంది. 4 పరుగులు చేసిన మయాంక్... మార్కో జాన్సెన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోరు 6 ఓవర్లలో 1 వికెట నష్టానికి 13 పరుగులు. ఓపెనర్ కేఎల్ రాహుల్ 5, నైట్ వాచ్ మన్ శార్దూల్ ఠాకూర్ 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ ఆధిక్యం 146 పరుగులకు చేరింది.

కాగా, ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో బుమ్రా కుడికాలికి గాయమైంది. మైదానాన్ని వీడిన బుమ్రాకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గాయం తీవ్రత తక్కువేనని వెల్లడైంది. దాంతో బుమ్రా తిరిగి మైదానంలోకి రావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.

  • Loading...

More Telugu News