Somu Veerraju: టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశాయి: సోము వీర్రాజు

  • విజయవాడలో ప్రజాగ్రహ సభ
  • ప్రసంగించిన సోము వీర్రాజు
  • హోదా అంశం నీతి ఆయోగ్ పరిధిలోనే ఉందని వెల్లడి
  • హోదా ఎందుకు వద్దన్నారో చంద్రబాబును అడగాలన్న సోము
  • ఏపీలో అన్నీ అమ్మేసుకుంటున్నారని వ్యాఖ్య
Somu Veerraju fires in TDP and YCP Govts

విజయవాడలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీలపై విమర్శలు చేశారు. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అభివృద్ధికి దూరం చేశాయని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు వద్దన్నారని ముందు చంద్రబాబును అడగాలని అన్నారు. హోదా అంశం నీతి ఆయోగ్ పరిధిలో ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.

ప్రస్తుతం కేంద్రం ఇచ్చే నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, కేంద్ర పథకాలకు వైసీపీ స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ నిధులతో జగనన్న రైతు భరోసా కేంద్రాలే ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. అదీ ఇదీ అని కాకుండా ఏపీలో అన్నింటినీ అమ్మేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ ప్రజాగ్రహ సభ ఏర్పాటు చేశామని వెల్లడించారు. తాము ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభ చూసి చాలామంది ఇబ్బందిపడుతున్నారని సోము వీర్రాజు అన్నారు.

ఆస్తులు కూడబెట్టేందుకు ఈ నేతలు తాపత్రయపడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ నేతలకు జైలు భయాలు లేవని స్పష్టం చేశారు. గతంలో బీజేపీ నేతలు జైలుకు వెళ్లలేదని, భవిష్యత్తులోనూ వెళ్లబోరని స్పష్టం చేశారు. జగన్ కు ఏం చూపించాలో అది బీజేపీ చూపిస్తుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో బీజేపీ నిరాడంబరతకు మారుపేరు అని సోము వీర్రాజు అభివర్ణించారు.

ఈ సందర్భంగా ఆయన వామపక్ష నేతలపైనా ధ్వజమెత్తారు. వాళ్లు కమ్యూనిస్టులు కాదు... క్యాపిటలిస్టులు అంటూ మండిపడ్డారు. యూనియన్లతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులేనని ఆరోపించారు. పేద పిల్లల ఆహార నిధులను కూడా దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్రేడింగ్ పార్టీల ఏజెంట్లుగా వామపక్షాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News