Britain: జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారం.. క్వీన్ ఎలిజబెత్ హత్యకు కుట్ర.. సిక్కు యువకుడి అరెస్ట్

  • క్రిస్మస్ వేడుకల్లో అంతం చేసేందుకు ప్రణాళిక
  • విల్లంబులతో విండ్సర్ క్యాజిల్ లో చొరబాటుకు యత్నం
  • హత్యాయత్నానికి ముందు వీడియో సందేశం
  • జాతి వివక్షతో అవమానాలకు గురైన, చనిపోయిన వారి తరఫున ప్రతీకారమంటూ కామెంట్లు
Sikh Youth Arrested For Allegedly Tried Assassinating Queen Elizabeth II

క్రిస్మస్ పర్వదినంతో బ్రిటన్ లోని విండ్సర్ క్యాజిల్ సందడిగా ఉంది. క్వీన్ ఎలిజబెత్ 2 (95) కూడా అక్కడే అందరితో కలిసి పండుగ చేసుకుంటున్నారు. ఇంతలో నూనూగు మీసాలతో ఉన్న 19 ఏళ్ల ఓ సిక్కు యువకుడు.. విల్లంబులతో క్యాజిల్ లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. రాణిని చంపేందుకు వచ్చానంటూ బదులిచ్చి అందరికీ షాకిచ్చాడు.

 కారణం.. వేలాది మందిని పొట్టనబెట్టుకున్న 1919 జలియన్ వాలాబాగ్ మారణకాండకు ప్రతీకారమని ఆ యువకుడు చెప్పి మరో షాకిచ్చాడు. ఆ యువకుడి పేరు జస్వంత్ సింగ్ చెయిల్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులకు దొరకడానికి ముందు అతడు తన ప్లాన్ కు సంబంధించి వీడియో కూడా చేశాడు. స్నాప్ చాట్ లో ఆ వీడియోను పోస్ట్ చేసి అందరికీ చేరేలా చూడాలని విన్నవించుకున్నాడు.  నల్లటి హూడీ, ముసుగు ధరించి ఆ వీడియో చేశాడు. రాజకుటుంబంలోని క్వీన్ ఎలిజబెత్ ను తాను చంపబోతున్నానంటూ పేర్కొన్నాడు.

‘‘నేను చేసినదానికి.. చేయబోతున్నదానికి అందరినీ క్షమాపణలు కోరుతున్నా. జలియన్ వాలాబాగ్ మారణహోమానికి ప్రతీకారంగా ఎలిజబెత్ రాణిని చంపబోతున్నా. వర్ణ, జాతి వివక్ష కారణంగా చనిపోయిన వారికి, అవమానాలకు గురైన వారికి, వివక్షను ఎదుర్కొన్న వారి తరఫున ఈ ప్రతీకార హత్యను చేస్తా’’ అని యువకుడు వీడియోలో పేర్కొన్నాడు. తన చావు దగ్గర్లోనే ఉందని పేర్కొంటూ స్టార్ వార్స్ సినిమాలోని కొన్ని ఉదాహరణలను ఉటంకించాడు.

కాగా, వీడియో విడుదలైన 24 నిమిషాలకు విండ్సర్ క్యాజిల్ వద్దే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక స్థితి సరిగ్గా లేదని చెబుతున్నారు. ప్రస్తుతం అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. సదరన్ ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో అతడు నివసిస్తున్నట్టు చెబుతున్నారు.

తన కుమారుడికి జరగరానిదేదో జరిగిందని, అదేంటో తెలుసుకుంటున్నామని యువకుడి తల్లిదండ్రులు పేర్కొన్నారు. తమ కుమారుడితో మాట్లాడే అవకాశం దొరకలేదని, అతడికి అవసరమైన సాయమందిస్తామని తెలిపారు. ప్రస్తుతం తాము చాలా కష్టకాలంలో ఉన్నామన్నారు. ఇంత పెద్ద సమస్యను పరిష్కరించడం అంత సులభమైన విషయమైతే కాదన్నారు.

More Telugu News