Shashi Tharoor: శశి థరూర్ పై మండిపడుతున్న కేరళ కాంగ్రెస్ వర్గాలు... కారణం ఇదే!

Kerala Congress disappoints with Sashi Tharoor for not signing petition against high speed rail corridor
  • కేరళలో హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుకు సర్కారు సన్నద్ధం
  • వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ
  • జీవావరణం దెబ్బతింటుందన్న సామాజికవేత్తలు
  • పిటిషన్ పై సంతకాల సేకరణ
  • శశి థరూర్ సంతకం చేయకపోవడంపై కాంగ్రెస్ ఆగ్రహం

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సొంత పార్టీలోనే నిరసనలు ఎదుర్కొంటున్నారు. అది కూడా సొంతగడ్డ కేరళలో ఆయనపై కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి. కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష సర్కారు కొత్తగా కేరళ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు తీసుకువస్తోంది. అయితే, దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ చేపట్టింది. ఈ పిటిషన్ పై శశి థరూర్ సంతకం చేయకపోవడం పట్ల కేరళ కాంగ్రెస్ లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనిపై కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ స్పందించారు.

"పార్టీలో ఇప్పుడు తన అభిప్రాయం చెప్పకుండా ఉన్నది శశి థరూర్ ఒక్కడే.  ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు వెల్లడించారు. పార్టీ వైఖరికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ తీర్మానాన్ని శశి థరూర్ అంగీకరిస్తే ఆయన పార్టీలో కొనసాగుతున్నట్టే... అంగీకరించకపోతే పార్టీలో లేనట్టే. అంతకుమించి ఇంకేం లేదు! శశి థరూర్ కానివ్వండి, నేను కానివ్వండి... అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరించే హక్కు ఏ కాంగ్రెస్ ఎంపీకి లేదు. ఆ లెక్కన చూస్తే శశి థరూర్ ఒక్కడు కాంగ్రెస్ కు భిన్నంగా కనిపిస్తున్నాడు" అంటూ సుధాకరన్ వ్యాఖ్యానించారు.

కేరళలో రూ.63,941 కోట్ల భారీ వ్యయంతో కె-రైల్ (కేరళ హైస్పీడ్ రైల్) సిల్వర్ లైన్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. కేరళలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కలుపుతూ 532 కిమీ పొడవున ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. ఈ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గుతుందని భావిస్తున్నారు.

అయితే, ఇది భారీ ప్రాజెక్టు కావడంతో దీని ద్వారా రాష్ట్రంలోని జీవావరణం తీవ్రంగా దెబ్బతింటుందని, అటవీప్రాంతాలు విధ్వంసానికి గురవుతాయని కాంగ్రెస్ నేతలతో పాటు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇది అధిక వ్యయంతో కూడుకున్నదని అంటున్నారు.

ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పిటిషన్ పై ఇప్పటివరకు సంతకం చేయని ఎంపీ శశి థరూర్ ఇటీవల పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా తన వైఖరి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు తానేమీ మద్దతు ఇవ్వడంలేదని వెల్లడించారు. అయితే, ఎలాంటి అపోహలకు తావుండని రీతిలో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

  • Loading...

More Telugu News