Rahul Dravid: ‘గోల్డెన్ డక్’ అయిన పుజారా వెన్నుతట్టి అనునయించిన ద్రావిడ్.. వీడియో వైరల్

  • ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరిన పుజారా
  • సోషల్ మీడియాలో ట్రోలింగ్
  • ద్రావిడ్‌పై కురుస్తున్న ప్రశంసలు
Rahul Dravid pats Cheteshwar Pujaras back after he bags golden duck in Centurion Test

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిలకడగా ఆడుతోంది. నిన్న ప్రారంభమైన ఈ టెస్టులో తొలి రోజు భారత్‌దే పై చేయి అయింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ టెస్టుల్లో ఏడో సెంచరీ పూర్తి చేసుకుని 122 పరుగులతోను, రహానే 40 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

అంతకుముందు 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా మరోమారు దారుణంగా విఫలమయ్యాడు. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో మూడో నంబరులో బ్యాటింగుకు దిగి డకౌట్ కావడం పుజారాకు ఇది తొమ్మిదోసారి.

పుజారా డకౌట్‌ అయిన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగులు ప్రారంభమయ్యాయి. అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన పుజారాను జట్టులోకి ఎలా తీసుకున్నారంటూ సెలక్షన్ కమిటీపై దుమ్మెత్తి పోశారు.

మరోవైపు, డకౌట్ అయి డ్రెస్సింగ్ రూముకు చేరుకున్న పుజారాను అనునయిస్తూ కోచ్ ద్రావిడ్ అతడి వెన్ను తట్టడం అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డకౌట్ అయి నిరాశగా డ్రెస్సింగ్ రూముకు వచ్చిన పుజారాను ఇలా వెన్నుతట్టి బాధపడొద్దని చెప్పడం చాలా బాగుందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దటీజ్ ద్రావిడ్ అంటూ కొనియాడుతున్నారు.

More Telugu News