immunity: వ్యాధులపై పోరాడే శక్తిని కోరుకుంటున్నారా.. అయితే ఇలా చేయొచ్చు..

  • పండ్లు, కూరగాయలకు ఎక్కువ చోటు
  • చేపలు కూడా మంచివే
  • 8 గంటల నిద్ర అవసరం
  • శారీరక వ్యాయామంతో మంచి ఫలితాలు
How to boost immunity

వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉన్నవారిని కరోనా వైరస్ ఏమీ చేయలేకపోతోంది. మన చుట్టూ ఉన్న వారిలో ఎంతో మంది విషయంలో మనం దీన్ని గమనించాం. అందుకే మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం ఇవన్నీ వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడతాయి. వ్యాధులపై పోరాడే సామర్థ్యం కోసం ప్రతి ఒక్కరూ ఇటువంటి ఆచరణను అమల్లో పెట్టుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు భాగం చేసుకోవాలి. ఒమెగా ఫ్యాటీ3 యాసిడ్స్ గుండెకు ఎంతో మేలు చేస్తాయి. చేపలు, వాల్ నట్స్, ఫ్లాక్స్ సీడ్, సోయాబీన్ ఆయిల్, కనోలా ఆయిల్ లో ఇవి లభిస్తాయి. రక్తహీనత లేకుండా చూసుకోవాలి. స్త్రీలలో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. కనుక బాలికలు, స్త్రీలు ప్రతి ఆరు నెలలకోసారి అయినా రక్త పరీక్షలు చేయించుకుంటూ హిమోగ్లోబిన్ ఎంత ఉందో చూసుకోవాలి.

మధుమేహం, బీపీ వంటివి ఉంటే వాటిని కచ్చితమైన నియంత్రణలో పెట్టుకోవాలి. ప్రతి రోజూ 30 నిమిషాలు తక్కువ కాకుండా వ్యాయామం చేయాలి. దీనికితోడు రోజులో కనీసం 8 గంటల పాటు నిద్ర రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి ఎంతో అవసరం. అది కూడా సరైన వేళల ప్రకారం ఉండాలి. అర్ధరాత్రి తర్వాత ఉపశమించి, బారెడు పొద్దెక్కిన తర్వాత లేచే వారిలో రోగ నిరోధక శక్తి అంత బలంగా ఉండదు.

పొగతాగడం, మద్యపానం, గుట్కా సేవనానికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ ను దూరం పెట్టాలి. శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. రోగ నిరోధక శక్తికి ఒత్తిడి పెద్ద శత్రువు అని గుర్తుంచుకోవాలి. కనుక ప్రాణాయామం, ధ్యానం వంటివి ఇందుకు అనుకూలిస్తాయి. శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి కొన్ని రకాల పదార్థాలు పడవు. ఇలాంటి వాటిని తీసుకోకూడదు. చికెన్ ఎక్కువగా తీసుకునే వారు దాన్ని తగ్గించి చేపలకు చోటు ఇస్తే మంచిది.

More Telugu News