COVAXIN: 12 ఏళ్లు పైబడిన చిన్నారులకు వ్యాక్సిన్.. కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతులు

Covaxin gets approval for emergency use for children aged 12
  • అత్యవసర అనుమతులు మంజూరు చేసిన డీసీజీఐ
  • 12-18 ఏళ్ల వయసు వారికి మాత్రమే
  • చిన్నారుల కోసం అందుబాటులోకి రెండో టీకా
హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ పార్మాస్యూటికల్స్ కంపెనీ భారత్ బయోటిక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాను 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అత్యవసర అనుమతులు లభించాయి. భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) ఈ మేరకు ప్రకటించింది. ఈ టీకాను 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇస్తారు. జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన జైకోవ్-డి తర్వాత చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతులు పొందిన రెండో టీకా ఇదే.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి క్రమంగా పెరుగుతున్న వేళ కొవాగ్జిన్‌కు అనుమతులు లభించడం కొంత ఊరటనిచ్చే అంశమే. కొవాగ్జిన్ టీకాను ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. అయితే, ఈ టీకా పంపిణీ ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే, టీకాల కోసం భారత్ బయోటెక్‌కు ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. కొవాగ్జిన్ టీకా మొదటి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు వేస్తారు. ఈ టీకాతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ లభిస్తుందని క్లినికల్ పరీక్షల్లో వెల్లడైనట్టు భారత్ బయోటెక్ తెలిపింది.

మరోవైపు, జనవరి మూడో తేదీ నుంచి దేశంలోని 15-18 ఏళ్ల మధ్య వారికి టీకాలు ఇవ్వనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత రాత్రి ప్రకటించారు. జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. 60 ఏళ్ల వయసు దాటి, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారికి వైద్యుల సలహాపై ‘ప్రికాషన్ డోసు’ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఆరోగ్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు జనవరి 10 నుంచి టీకాలు వేయనున్నట్టు మోదీ తెలిపారు.
COVAXIN
Children
India
Bharat Biotech
DCGI
ZyCoV-D

More Telugu News