Yogi Adityanath: బీజేపీ తదుపరి ప్రధాని ఆయుధం యోగీయేనా..? వ్యూహకర్తలు ఏమంటున్నారు?

  • మోదీకి ప్రస్తుతం 71 ఏళ్లు
  • 75 ఏళ్లకు అధికారం త్యజిస్తే తదుపరి యోగీయేనా?
  • లేక అమిత్ షానా?
  • యోగీది మోదీ తరహా శైలి.. పాలన
  • హిందూ నేతగా ఎక్కువ ప్రజాదరణ
  • సీఎంగా పాస్ మార్కులు.. ఆర్ఎస్ఎస్ మద్దతు 
  • అమిత్ షాకు గట్టిపోటీ
Is Yogi Adityanath the likely successor of PM Modi

మోదీ, అమిత్ షా.. గుజరాత్ కు చెందిన ఈ ఇద్దరు బీజేపీ అగ్రనేతలు తమ వ్యూహాలు, ప్రణాళికలు, సమష్టి కృషితో బీజేపీని దేశంలో అత్యంత బలమైన పార్టీగా అవతరించేలా చేశారనడంలో అతిశయోక్తి లేదు. వాజ్ పేయీ, అద్వానీ వంటి ప్రజాదరణ ఉన్న నేతలు గతంలో బీజేపీని నడిపించినప్పటికీ.. పార్టీ కొంత పుంజుకున్నదే కానీ, కాంగ్రెస్ ను మట్టికరిపించే స్థాయికి రాలేకపోయింది.

గతంలో ఎన్డీయే సంకీర్ణ సర్కారును నడిపించిన వాజ్ పేయి సౌమ్యుడు కావడం, కఠిన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు బీజేపీని ఒక స్థాయికి తీసుకొచ్చి ఆపేశాయి. దీంతో అప్పటి వరకు గుజరాత్ రాష్ట్రాన్ని పలు పర్యాయాలు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా, తెర వెనుకనుండి ఆర్ఎస్ఎస్ ముందుకు తీసుకొచ్చింది.

2014లో బీజేపీ దేశవ్యాప్త ఘన విజయంతో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మోదీ.. మొదటి ఐదేళ్లూ మెరుగైన పాలన అందించి... మరింత ఎక్కువ మంది ప్రజల ఆమోదంతో మరోసారి ప్రధాని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కానీ, బీజేపీలో నేతలు ఎరవైనా కానీ 75 ఏళ్ల వయసు తర్వాత పదవులు చేపట్టడానికి వీల్లేదన్న నిబంధనను మోదీయే తీసుకొచ్చారు.

ఇదే కారణంతో అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి వారిని పక్కకు తప్పించారు. కానీ, ఇప్పుడు మోదీ వయసు 71 ఏళ్లు. 2024 ఎన్నికల సమయానికి ఆయన 74 ఏళ్లకు సమీపిస్తారు. మరోసారి మోదీ, షా ద్వయం బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేట్టు అయితే.. ఏడాది కాలం మించి (నిబంధనల మేరకు) ప్రధానిగా మోదీ పనిచేయడానికి అవకాశం ఉండదు.

మరి అప్పుడు ఆయన తాను స్వయంగా పెట్టిన వయోపరిమితి నిబంధనను సడలించి.. ముందుకు వెళతారా? లేక వేరొకరిని ఆ కీలక బాధ్యతల్లోకి తీసుకొస్తారా..? ఇప్పుడు రాజకీయ వ్యూహకర్తలు, విశ్లేషకులు, ప్రజల్లోనూ ఈ చర్చ నడుస్తోంది. దీనిపై భిన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.

ఒకవేళ వయోపరిమితి నిబంధనను గౌరవించి మోదీ 75 ఏళ్లకే తప్పుకున్నారనుకుందాం. అప్పుడు ఆ స్థానాన్ని చేపట్టే సమర్థత, బలం, ఆర్ఎస్ఎస్ ఆమోదం పొందే వ్యక్తి ఎవరూ? అంటే యూపీ సీఎంగా ప్రజాదరణను పొందుతున్న యోగి ఆదిత్యనాథ్ అనే వినిపిస్తోంది. ఆదిత్యనాథ్ వయసు 49 ఏళ్లే. ఆయనకంటే తలపండిన, కాకలు తీరిన నేతలు బీజేపీలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఉండనే ఉన్నారు. అలాగే, గతంలో బీజేపీ అధ్యక్షుడు, రెండు విడతలుగా మంత్రి బాధ్యతల్లో ఉన్న నితిన్ గడ్కరీ కూడా బలమైన నేతే. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా ఉన్నారు.

కానీ ఇక్కడ చూడవలసిన అంశాలు చాలా ఉన్నాయి. రాజ్ నాథ్ సింగ్ వయసు కూడా 70 దాటేసింది. అమిత్ షా వయసులో యోగి కంటే ఏడేళ్లు పెద్ద. అంటే 56 ఏళ్లు. వ్యూహాలు, ప్రణాళికల రూపకల్పన, అమలులో షా ప్రతిభకు తిరుగులేదు. కాలేజీ రోజుల నుంచి ఆయన ఏబీవీపీతో అనుబంధం కలిగిన నాయకుడు. కానీ, షాకు ప్రజాదరణ తక్కువ. ఈ ఒక్క అంశం ఆయనకు అడ్డు పడొచ్చు. నితిన్ గడ్కరీ కూడా దేశవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేత కాదు, అదే సమయంలో కరుడు గట్టిన హిందుత్వ వాదీ కాదు.

ఇక్కడే యోగీకి బాగా మొగ్గు కనిపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ హిందుత్వాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. యూపీలో ఆయనకు ఎంతో ప్రజాదరణ ఉంది. నరేంద్ర మోదీ సర్కారు మొదటి విడతలో యోగి కేంద్ర మంత్రిగా కొంత కాలం పనిచేశారు. ఆయనను దగ్గర్నుంచి చూసిన మోదీ.. యోగిలోని ప్రతిభ, నైపుణ్యాలను పసిగట్టారు. 2017లో యూపీ సీఎంగా అవకాశం కల్పించడంలో మోదీ ఆశీర్వాదమే ఉంది.

దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్.. శాంతిభద్రతల పరంగా, అభివృద్ధి పరంగా ఎంతో వెనుకబడి ఉండగా.. యోగి తన మార్క్ పాలనతో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రౌడీ మూకలకు చెక్ పెట్టారు. శాంతిభద్రతలను మెరుగుపరిచారు. అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర సర్కారు అండతో పెద్ద ఎత్తున చేపట్టారు. ఎన్నో పథకాలను ఆవిష్కరించారు.

‘తక్కువ మాట్లాడు.. ఎక్కువ పనిచేయి’ అనే సూత్రాన్నే యోగి అనుసరించారు. మోదీ స్టయిల్ కూడా ఇదే. అందుకే వీరిద్దరికి ఎన్నో సారూప్యతలు ఉన్నాయి. యోగిని కర్మయోగిగా ప్రధాని ఇటీవలే యూపీ పర్యటనలో అభివర్ణించారు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే నేతలు వీరు. కనుక మోదీ తన తర్వాత యోగికే ఆ బాధ్యతలు కట్టబెడతారన్న అంచనాలున్నాయి. యూపీ ముఖ్యమంత్రిగా తన పనితీరుతో యోగి ఆదిత్యనాథ్ దేశవ్యాప్తంగానూ పాప్యులారిటీ తెచ్చుకున్నారు. కనుక మోదీ వారసుడిగా యోగి రావచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

2024 ఎన్నికలకు ముందే యోగిని తెరపైకి తీసుకురావచ్చని కొందరు విశ్లేషకులు అంచనాలు కడుతున్నప్పటికీ, ఇందుకు సంబంధించి సంకేతాలు ఇప్పటి వరకైతే కనిపించడం లేదు. యోగి ఆదిత్యనాథ్ సీఎంగా సమర్థత చూపిస్తున్నారు. యూపీని గాడిన పెట్టిన ఈ నేతను కేంద్రంలోకి తీసుకొస్తే.. తిరిగి యూపీకి సమర్థుడైన నేతను గుర్తించడం బీజేపీకి కఠిన పరీక్షే అవుతుంది. సంఖ్యా పరంగా, సీట్ల పరంగా ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రం. ఇక్కడ మెజారిటీ సీట్లలో విజయం సాధిస్తేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలత ఉంటుంది. కనుక యోగి ఆదిత్యనాథ్ ను కొంతకాలం పాటు యూపీకే పరిమితం చేయవచ్చన్నది ఒక విశ్లేషణ.

ఇదే నిజమైతే మోదీ తర్వాత బీజేపీ తరఫున ప్రధాని బాధ్యతలకు ఎక్కువ అర్హతలు కలిగిన వ్యక్తి అమిత్ షానే అవుతారు. అమిత్ షా మోదీకి సన్నిహితుడు, ఆప్తుడు కూడా. కనుక మోదీ మద్దతు కూడా ఆయనకు ఉండదని చెప్పలేం. ఒకవేళ బీజేపీ ప్రభ తగ్గితే.. అప్పుడు యోగి రూపంలో దాన్ని అధిగమించాలన్న ఆలోచనతో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడో ఒకప్పుడు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా యోగి రంగంలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది ఎక్కువ మంది చెబుతున్న మాట.

More Telugu News