Owaisi: మోదీ.. యోగీ వెళ్లిపోతారు.. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? అల్లా మీ అంతం చూస్తాడు: యూపీ పోలీసులకు అసదుద్దీన్ వార్నింగ్

  • కాన్పూర్ సభలో అసదుద్దీన్ రెచ్చగొట్టే ప్రసంగం
  • మోదీ, యోగీ పదవుల్లో శాశ్వతంగా వుండరు   
  • ముస్లింలం కచ్చితంగా అధికారం సాధిస్తాం  
  • మీ వేధింపులను మేము మర్చిపోమన్న ఒవైసీ 
  • తీవ్రంగా స్పందించిన బీజేపీ నేతలు
Owaisi Threat To Police

ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బహిరంగంగానే తీవ్ర హెచ్చరిక చేశారు. మోదీ, యోగీ పదవుల నుంచి దిగిపోయిన తర్వాత ఎవరూ మిమ్మల్ని కాపాడలేరన్న విధంగా ఆయన కాన్పూర్ లో జరిగిన బహిరంగ సభ వేదికగా రెచ్చగొట్టే ప్రసంగం చేశారు. అసుదుద్దీన్ ఆవేశపూరిత ప్రసంగానికి సభకు హాజరైన వారు హర్షామోదాలు తెలియజేసినట్టు వీడియో చూస్తే తెలుస్తుంది. బీజేపీ నేతలు ఈ వీడియోను విడుదల చేస్తూ, ఇదేమీ పాకిస్థాన్ కాదని, ఇక్కడ తాలిబన్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు.

మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒవైసీ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ‘‘పోలీసు అధికారులకు నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నాను. సీఎంగా యోగీ, ప్రధానిగా మోదీ ఆ పదవుల్లో శాశ్వతంగా ఉండరు. యోగీ వెళ్లిపోతారు. మోదీ కూడా వెళ్లిపోతారు. మరి ఎవరు వస్తారు? ముస్లింలం కచ్చితంగా అధికారం సాధిస్తాం. కానీ, గుర్తుంచుకోండి. మీ వేధింపులను మేము మర్చిపోయే ప్రసక్తే లేదు. మేము మీ వేధింపులను కచ్చితంగా గుర్తు పెట్టుకుంటాం. అల్లా తన శక్తితో మిమ్మల్ని అంతం చేస్తాడు’’ అంటూ ఒవైసీ హెచ్చరిక చేశారు.

ఈ ప్రసంగంపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. ‘‘ఇది క్రిమినల్ మనస్తత్వం. సమాజానికి ఎటువంటి సందేశం ఇద్దామనుకుంటున్నారు? ఇది ఆమోదనీయం కాదు’’ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాన్ నఖ్వి అన్నారు. యూపీ మంత్రి మోహిసిన్ రాజా కూడా గట్టిగానే బదులిచ్చారు. ఇది పాకిస్థాన్ కాదని, తాలిబన్ తరహా వ్యక్తులకు ఇక్కడ చోటు లేదని అన్నారు.

More Telugu News