IIT Kanpur: ఫిబ్రవరి మొదటి వారం నాటికి పతాకస్థాయికి దేశంలో కరోనా మూడో వేవ్

  • ఐఐటీ కాన్పూర్ పరిశోధకుల తాజా అధ్యయనం
  • ఇప్పటికే పలు దేశాల్లో కరోనా థర్డ్ వేవ్
  • గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించిన పరిశోధకులు
  • డిసెంబరు 15 నుంచి భారత్ లో థర్డ్ వేవ్ 
IIT Kanpur conducts latest study on Covid third wave in India

భారత్ లోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఐఐటీ కాన్పూర్ తాజా అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దేశంలో కరోనా మూడో వేవ్ 2022 ఫిబ్రవరి మొదటి వారం నాటికి పతాకస్థాయికి చేరుతుందని ఆ అధ్యయనంలో అంచనా వేశారు. భారత్ లో తొలి రెండు కరోనా వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యను గసియాన్ మిశ్రమ నమూనా విధానంలో గణించిన ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ నిర్ణయానికి వచ్చారు.

ప్రపంచంలో ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా, జర్మనీ వంటి దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ గరిష్ఠ స్థాయిలో నడుస్తోంది. ఈ సందర్భంగా ఆయా దేశాల కరోనా కేసుల సరళిని కూడా పరిశీలించారు. భారత్ లో తొలి రెండు వేవ్ ల సమయంలో నమోదైన కేసుల సంఖ్యతో ఆయా దేశాల కరోనా డేటాతో క్రోడీకరించారు.

అయితే వ్యాక్సినేషన్ అంశాన్ని ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు. అందువల్ల ఫిబ్రవరి నాటికి ఎన్ని కేసులు వస్తాయన్నదానిపై తాజా అధ్యయనంలో పేర్కొనలేదు. ఈ ఏడాది డిసెంబరు 15 నుంచి నమోదైన కేసులను కరోనా థర్డ్ వేవ్ లో భాగంగా పరిగణించారు. ఇవి 3 ఫిబ్రవరి 2022 నాటికి గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని అంచనా కట్టారు.

More Telugu News