Piyush Jain: సమాజ్ వాదీ పార్టీ నేత ఇంట్లో కట్టలు కట్టలుగా డబ్బు.... నిన్న సాయంత్రం నుంచి లెక్కిస్తూనే ఉన్న అధికారులు!

  • యూపీలో రాజుకుంటున్న అసెంబ్లీ ఎన్నికల వేడి
  • సమాజ్ వాదీ పార్టీ నేత పియూష్ జైన్ పై ఐటీ దాడులు
  • రెండు అల్మరాల్లో కట్టలు కట్టలుగా డబ్బు
  • ఈ ఉదయానికి రూ.150 కోట్లు లెక్కించిన అధికారులు
IT raids on Samajwadi Party leader Piyush Jain

ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవలే తమ పిల్లల ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లు హ్యాక్ చేస్తున్నారంటూ యూపీ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా, సమాజ్ వాదీ పార్టీ నేత, వ్యాపారవేత్త పియూష్ జైన్ పై ఐటీ దాడులు జరిగాయి. పియూష్ జైన్ ఇటీవలే సమాజ్ వాదీ పార్టీ పేరిట ఓ పెర్ఫ్యూమ్ ను మార్కెట్లోకి తీసుకువచ్చారు. జైన్... సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కు బాగా కావాల్సినవాడు అనే గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా జరిగిన ఐటీ దాడుల్లో జైన్ నివాసంలో కట్టలు కట్టలుగా డబ్బు బయటపడింది. రెండు అల్మరాల్లో వెదకగా ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి. నిన్న సాయంత్రం లెక్కించడం మొదలుపెడితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ ఉదయానికి ఐటీ అధికారులు లెక్కించిన మొత్తం రూ.150 కోట్లు ఉంటుందని అంచనా. లెక్కింపు పూర్తయ్యేసరికి ఆ మొత్తం ఇంకా పెరుగుతుందని భావిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ఆ అల్మరాలు తెరిచి చూసిన ఐటీ అధికారులు నివ్వెరపోయారంటే ఎన్ని నోట్ల కట్టలు కనిపించాయో ఊహించుకోవచ్చు.

ఈ ఐటీదాడులు ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగాయి. పియూష్ జైన్ పై పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. కాగా, జైన్ పై ఐటీ దాడుల విషయం తెలుసుకున్న జీఎస్టీ అధికారులు కూడా సోదాలు చేపట్టగా, వందల సంఖ్యలో ఫేక్ ఇన్ వాయిస్ లు లభ్యమయ్యాయి. నకిలీ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్ వాయిస్ లు సృష్టించి, తద్వారా జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించారు.

జైన్ నివాసంలో దొరికిన డబ్బంతా ఇలా నకిలీ ఇన్ వాయిస్ లు, ఈ-వే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదని భావిస్తున్నారు. జైన్ నివాసంపైనే కాదు, గుజరాత్, మహారాష్ట్రలోనూ ఆయన ఆఫీసులు, గోడౌన్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

కాగా, ఈ ఘటనపై బీజేపీ స్పందించింది. పెర్ఫ్యూమ్ వ్యాపారి జైన్ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన నేపథ్యంలో, సమాజ్ వాదీ పార్టీ అవినీతి కంపు అంటూ ఎద్దేవా చేసింది. పెర్ఫ్యూమ్ ఎక్కడైనా ఎంతో సువాసన వస్తుందని, కానీ ఆ పెర్ఫ్యూమ్ సమాజ్ వాదీ పార్టీ చేతుల్లోకి వెళితే ఆ సువాసనను సైతం చంపేస్తారని, ఈ అవినీతి వారికి అలవాటేనని విమర్శించింది.

More Telugu News