Rajasthan: రాజస్థాన్‌లో క్రూరం.. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్త కాళ్లలో మేకులు దిగ్గొట్టిన దుండగులు

  • కిడ్నాప్ చేసి గంటల తరబడి చిత్రహింసలు
  • కాళ్లు, చేతులు విరిచేసిన వైనం
  • చనిపోయాడని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయిన దుండగులు
  • నిందితుల కోసం పోలీసుల గాలింపు
Rajasthan RTI activists legs pierced with nails after complaint on illegal liquor sale

రాజస్థాన్‌లో అమానవీయ ఘటన జరిగింది. మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన ఆర్టీఐ కార్యకర్తపై కొందరు దుండగులు చెలరేగిపోయారు. అతడిని కిడ్నాప్ చేసి కాళ్లలో మేకులు కొట్టారు. సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే... బార్మర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల అమ్రారామ్ గోద్రా ఆర్టీఐ కార్యకర్త. గ్రామ పంచాయతీ పరిధిలో అవినీతి, మద్యం అక్రమ అమ్మకాలపై ఫిర్యాదు చేశారు.

విషయం తెలిసిన మద్యం మాఫియా ఈ నెల 21న ఆయనను అపహరించింది. ఆపై ఇనుపరాడ్లతో ఆయనపై దాడిచేశారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. అనంతరం రెండు కాళ్లలో మేకులు దిగ్గొట్టారు. ప్రస్తుతం జోధ్‌పూర్ ఆసుపత్రిలో ఉన్న గోద్రా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

ఆర్టీఐ ద్వారా గోద్రా పోలీసులు, ఇతరులకు సమాచారం అందించినట్టు బార్మర్ ఎస్పీ దీపక్ భార్గవ తెలిపారు. ఆసుపత్రికి వెళ్లిన ఏఎస్పీ.. గోద్రాను పరామర్శించినట్టు చెప్పారు. ఈ ఘటనపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. నిందితుల కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా వారిని పట్టుకుని శిక్షిస్తామని ఎస్పీ తెలిపారు.

కారులో వచ్చిన 8 మంది దుండగులు గోద్రాను అపహరించి గంటల తరబడి హింసించారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. కాళ్లలో మేకులు దించారు. దీంతో అతడు చనిపోయాడని భావించి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News