Dilip Vengsarkar: సౌరవ్ గంగూలీకి ఆ అధికారం లేదు: దిలీప్ వెంగ్ సర్కార్

  • వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడంపై వివరణ ఇచ్చిన గంగూలీ
  • కెప్టెన్సీ మార్పు గురించి సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ మాట్లాడాలన్న వెంగ్ సర్కార్
  • సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని కోహ్లీ గౌరవించాలని వ్యాఖ్య
Ganguly does not have that right says Dilip Vengsarkar

వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించడం భారత క్రికెట్లో సరికొత్త వివాదానికి కారణమయింది. వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతోనే వన్డే కెప్టెన్ బాధ్యతల నుంచి కోహ్లీని సెలెక్టర్లు తప్పించారని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వివరణ ఇచ్చారు. ఈ విషయం గురించి సెలెక్టర్లు కోహ్లీతో మాట్లాడారని కూడా అన్నారు. అయితే, కోహ్లీ మాట్లాడుతూ కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు తనతో ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించాడు.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలెక్టర్ దిలీప్ వెంగ్ సర్కార్ స్పందిస్తూ... గంగూలీకి అలా మాట్లాడాల్సిన అవసరం లేదని, అలా మాట్లాడే అధికారం కూడా లేదని అన్నారు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని... కెప్టెన్సీ మార్పు గురించి ఏదైనా వివాదం తలెత్తితే దాన్ని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చూసుకుంటాడని చెప్పారు. కోహ్లీని కెప్టెన్ గా ఎందుకు తప్పించాల్సి వచ్చిందనే కారణాన్ని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ వివరించాల్సి ఉంటుందని అన్నారు.

కెప్టెన్ ను ఎంపిక చేయడం లేదా తీసివేయడం అనేది సెలెక్షన్ కమిటీ పని అని చెప్పారు. ఇందులో వేలు పెట్టే అవకాశం బీసీసీఐ అధ్యక్షుడికి ఉండదని అన్నారు. అయితే కోహ్లీకి, అతని అభిమానులకు క్లారిటీ ఇచ్చేందుకు గంగూలీ ఆ విషయం గురించి మాట్లాడి ఉండొచ్చని చెప్పారు. సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని కోహ్లీ గౌరవించాల్సిందేనని అన్నారు.

More Telugu News