Akhilesh Yadav: భార్య, కూతురుకి కరోనా.. అఖిలేశ్ యాదవ్ కు సీఎం యోగి ఫోన్!

Yogi Adityanath phones Akhilesh Yadav after his wife and daughter tests Corona positive
  • అఖిలేశ్ భార్య డింపుల్, కుమార్తెకు కరోనా పాజిటివ్
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన యోగి ఆదిత్యనాథ్
  • ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అఖిలేశ్
సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ తో పాటు ఆయన కుమార్తె కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అఖిలేశ్ కు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోన్ చేశారు. ఈ విషయాన్ని యూపీ సీఎం కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. అఖిలేశ్ యాదవ్ కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని యోగి ఆకాంక్షించారని తెలిపింది.

మరోవైపు తాము కరోనా బారిన పడినట్టు డింపుల్ యాదవ్ నిన్న ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నానని చెప్పారు. ప్రస్తుతం తాము ఐసొలేషన్ లో ఉన్నామని తెలిపారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆమె కోరారు.

అయితే అఖిలేశ్ యాదవ్ ఇంత వరకు వ్యాక్సిన్ వేయించుకున్నారో, లేదో తెలియడం లేదు. గతంలో ఆయన ఒకసారి మాట్లాడుతూ తన తండ్రి ములాయం సింగ్ యాదవ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత తాను వేయించుకుంటానని చెప్పారు. మరోసారి ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పై ప్రధాని మోదీ ఫొటోను తొలగిస్తేనే తాను టీకా వేయించుకుంటానని వ్యాఖ్యానించారు.

మరోపక్క, ప్రస్తుతం అఖిలేశ్ యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఆయన అనేక ర్యాలీలు, సమావేశాల్లో పాల్గొనబోతున్నారు. ఈ రోజు రాష్ట్రీయ లోక్ దళ్ నేత జయంత్ చౌదరితో కలిసి ఒక ర్యాలీని నిర్వహించనున్నారు.
Akhilesh Yadav
Wife
Daughter
Corona Virus
Yogi Adityanath
BJP

More Telugu News