YS Vivekananda Reddy: వివేకానందరెడ్డి హత్యకేసు.. గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారానికి ఆద్యుడు శివశంకర్‌రెడ్డే: సీబీఐ

Vivekananda Reddy murder case Shivshankar Reddy leads campaign against death of heart attack
  • ఆ సిద్ధాంతానికి రూపకల్పన చేసింది ఆయనే
  • సీఐ శంకరయ్యను బెదిరించారు
  • వివేకా శరీరంపైనున్న గాయాలకు కాంపౌండర్‌తో బ్యాండేజీలు
  • వివేకాను చంపితే భారీ మొత్తం ఇస్తానని సునీల్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరికి ఆఫర్
  • ఆయనకు బెయిలిస్తే సాక్ష్యాల తారుమారు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో వెలుగుచూసిన కీలక విషయాన్ని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలకు సంబంధించిన వివరాలను న్యాయస్థానం ముందు ఉంచింది. ఆ వివరాల ప్రకారం.. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వెల్లడించారు.

వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం చేయాలన్న సిద్ధాంతానికి రూపకల్పన చేసిన వారిలో ఆయన ప్రధాన భాగస్వామని సీబీఐ ఆ రిపోర్టులో పేర్కొంది. వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు ఆయనే ‘సాక్షి’ టీవీకి కూడా చెప్పారని తెలిపింది. అంతేకాకుండా ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని, వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్టుకట్టించారని వివరించింది.

కొందరు సాక్షులు ఇటీవల సోషల్ మీడియాలో కొత్తకొత్త పేర్లను తెరపైకి తీసుకొస్తూ దర్యాప్తును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సీబీఐ పేర్కొంది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసి, పరారయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వివేకాను చంపితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని యాదటి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి చెప్పారని నివేదికలో సీబీఐ పేర్కొంది. అంతేకాదు, వివేకా హత్యకేసు విషయంలో సీఐ శంకరయ్యను బెదిరించారని, ఆయన గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని తాము చెబుతున్నామని, కాబట్టి ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలని శంకరయ్యను హెచ్చరించారని, సాక్షులను బెదిరించారని సీబీఐ తన రిపోర్టులో పేర్కొంది.
YS Vivekananda Reddy
CBI
Devireddi Sivasankar Reddy
Andhra Pradesh
YS Jagan

More Telugu News