Hyderabad: పబ్‌కు వెళ్లిన సినీ జూనియర్ ఆర్టిస్టుకు పోకిరీల వేధింపులు

harassment to a junior artist who went to the pub in Hyderabad
  • జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36 లోని క్లబ్ రోగ్ పబ్ వద్ద ఘటన
  • యువతిని అసభ్యంగా వేధించడంతోపాటు కారులో వెంబడించిన వైనం
  • నిందితులను స్టేషన్‌కు పిలిపించి విచారించిన పోలీసులు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌కు వెళ్లిన సినీ జూనియర్ ఆర్టిస్టును పోకిరీలు వేధించారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్న యువతి (28) మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని క్లబ్ రోగ్ పబ్‌కు స్నేహితురాళ్లతో కలిసి వెళ్లింది. అదే పబ్‌కు స్నేహితులతో కలిసి వచ్చిన వాహిద్ అనే యువకుడు ఆమెను అనుసరించాడు.

పబ్ నుంచి కిందికు వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ పార్కింగ్ వద్దకు వచ్చి  కారు కోసం వేచి చూస్తుండగా అక్కడికి వచ్చిన వాహిద్, అతడి స్నేహితులు ఆమెను చూస్తూ అసభ్యకరంగా  సైగలు చేశారు. కార్లు మార్చుకుందామంటూ మాటలు కలిపే ప్రయత్నం చేశారు. ఆమె పట్టించుకోకపోవడంతో బెదిరించే ప్రయత్నం చేశారు.

యువతి కారు ఎక్కుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆమె కారును వెంబడించారు. వారి వేధింపులు భరించలేని యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టోలీచౌక్‌కు చెందిన వాహిద్, అతడి స్నేహితులను పోలీసులు స్టేషన్‌కు పిలిచి విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Jubilee Hills
Club Rogue
Pub
Tollywood

More Telugu News