Madagascar: సముద్రంలో కూలిన హెలికాప్టర్.. 12 గంటలు ఈది ఒడ్డుకొచ్చిన మడగాస్కర్ రక్షణ మంత్రి!

  • హిందూ మహాసముద్రంలో కూలిన హెలికాప్టర్
  • మంత్రిలానే ఈదుకుంటూ మరో తీరానికి చేరిన చీఫ్ వారంట్ అధికారి
  • నీటిలో బాగా తడిసిపోవడం తప్ప ఏం కాలేదన్న మంత్రి
  • ‘హీరో’ అని కొనియాడుతున్ననెటిజన్లు
Madagascar Minister Swims 12 Hours To Shore After Deadly Helicopter Crash

కష్టాల్లో చిక్కుకుని బయటపడేందుకు చుట్టూ ఏ దారి కనిపించనప్పుడు కూడా దృఢసంకల్పం ఉంటే కష్టాలకు ఎదురీది ప్రాణాలు నిలబెట్టుకోవచ్చని నిరూపించారు తూర్పు ఆఫ్రికా దేశమైన మడగాస్కర్ రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె (57). ఆయన ప్రయాణిస్తున్న విమానం నడిసముద్రంలో కూలిపోయిన వేళ అలుపు సొలుపు లేకుండా 12 గంటలపాటు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు.

64 మంది ప్రయాణికులతో వెళ్తూ హిందూ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ బోటు ప్రదేశాన్ని పరిశీలించేందుకు మంత్రి సోమవారం సాయంత్రం హెలికాప్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలతో హెలికాప్టర్ ఒక్కసారిగా సముద్రంలో కూలిపోయింది. ఆయనతోపాటు ప్రయాణించిన ముగ్గురి జాడ కనిపించలేదు.

మంత్రి మాత్రం తన సీటును ఊడదీసి, దానిని లైఫ్ జాకెట్‌లా వాడుకున్నారు. ఆపై 12 గంటలపాటు ఈది తీరానికి చేరుకున్నారు. చేపల వేటకు వెళ్లిన ఓ జాలరి తీరానికి సమీపంలో ఆయనను గమనించి ఒడ్డుకు చేర్చాడు. మరోవైపు, మంత్రితోపాటు ప్రయాణించిన వారిలో ఉన్న చీఫ్ వారంట్ అధికారి జిమ్మీ లాయిట్సారా కూడా అలాంటి సాహసమే చేశారు. ఆయన ఈదుకుంటూ మహాంబో తీరానికి చేరుకున్నారు.

ప్రాణాలతో బయటపడిన రక్షణ మంత్రి జనరల్ సెర్జ్ గెల్లె ఆ తర్వాత ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. పైవాడి (దేవుడి) నుంచి తనకు ఇంకా పిలుపు రానందుకే తీరానికి చేరుకోగలిగానని పేర్కొన్నారు. తనకేం కాలేదని అయితే, బాగా తడిసిపోయానని అన్నారు. తన సహచరులు మాత్రం చనిపోయి ఉండొచ్చని విచారం వ్యక్తం చేశారు. ఆ విషయాన్ని తలచుకుంటేనే బాధగా ఉందన్నారు. తాను పైలట్ వెనక సీట్లో కూర్చున్నానని, ప్రమాదం జరిగిన తర్వాత సీటును బలవంతంగా ఊడదీసి దానిని లైఫ్ జాకెట్‌లా వాడుకున్నట్టు చెప్పారు.

బతకడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేశానని, బరువైన వస్తువులన్నీ వదిలేశానని గుర్తు చేసుకున్నారు. తాను బాగానే ఉన్నానని, మరో 24 గంటల్లో విధులకు హాజరవుతానని చెప్పుకొచ్చారు. కాగా, ఆయన పోస్టు చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత మంత్రిని అందరూ ‘హీరో’ అని కొనియాడుతున్నారు. కాగా, పడవ ప్రమాదంలో మృతి చెందిన వారిలో 25 మంది మృతదేహాలు నిన్న లభ్యమయ్యాయి.

  • Loading...

More Telugu News