Smriti Irani: అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంచుతూ సవరణ బిల్లు... లోక్ సభలో గందరగోళం

Union Minister Smriti Irani introduced marital age limit amendment bill in Lok Sabha
  • లోక్ సభలో ప్రవేశపెట్టిన స్మృతి ఇరానీ
  • విపక్ష సభ్యుల ఆందోళన
  • లోక్ సభ రేపటికి వాయిదా
  • ఇప్పటివరకు అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు
హిందూ వివాహ చట్టం (1955) ప్రకారం అమ్మాయిల కనీస వివాహ వయసు ఇప్పటివరకు 18 ఏళ్లుగా ఉండేది. అయితే మారుతున్న పరిస్థితులు, సామాజిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ వయసును 21 ఏళ్లకు పెంచడం తెలిసిందే. ఇటీవలే ఆ నిర్ణయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందే.

ఈ నేపథ్యంలో అమ్మాయిల కనీస వివాహ వయసు 21 ఏళ్లకు పెంచుతూ రూపొందించిన బిల్లును కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు నిరసనల మధ్యే ఆమె బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. అయితే విపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది.

కాగా, కనీస వివాహ వయసును పెంచిన నేపథ్యంలో, కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని కూడా సవరించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దాంతో బాల్య వివాహాల నిరోధక చట్టం సవరణ బిల్లును కేంద్రమంత్రి స్మృతి ఇరానీ లోక్ సభ ముందుకు తీసుకువచ్చారు.

ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ... "మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. వైవాహిక జీవితంలో అడుగుపెట్టే అంశంలో మహిళలు, పురుషులకు సమాన హక్కులు కల్పించేందుకు 75 ఏళ్లు పట్టింది. ఈ సవరణ బిల్లు ద్వారా పురుషులు, మహిళలు 21 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు తమ వివాహంపై నిర్ణయం తీసుకోగలుగుతారు. సమానత్వ హక్కు ప్రాతిపదికన ఈ బిల్లుకు సవరణ చేశాం" అని వివరణ ఇచ్చారు.
Smriti Irani
Marital Age
Women
Amendment Bill
Lok Sabha

More Telugu News