corona: ఒమిక్రాన్ లక్షణాలు వేరే.. ఇది సోకిన వారిలో ఊపిరాడకపోవడం ఎందుకు కనిపించడం లేదు?

  • గొంతులో ఇన్ఫెక్షన్
  • ఒళ్లు నొప్పులు, నీరసం
  • ప్రధానంగా కనిపించే లక్షణాలు ఇవే
why breathing difficulty may not be linked with Omicron variant

కరోనా ఒమిక్రాన్ రకం ప్రమాదకరమైనదిగా ఇప్పటి వరకైతే నిర్ధారణ కాలేదు. పైగా గతంలోని ఆల్ఫా, డెల్టా వేరియంట్ల మాదిరిగా ఒమిక్రాన్ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కూడా కనిపించడం లేదు. ప్రధానంగా ఊపిరి ఆడకపోవడమనే లక్షణం ఈ రకంలో అసలు కనిపించడం లేదు. దీనికి కారణం ఏమై ఉంటుందన్న దానికి ఎయిమ్స్ డాక్టర్ పునీత్ ముస్రా విశ్లేషణ ఇలా ఉంది.

ఇప్పటి వరకు మనం చూసిన కరోనా కేసుల్లో శ్వాస తీసుకోవడం కష్టతరంగా అనిపించిన కేసులే ఎక్కువగా ఉన్నాయి. చికిత్స తర్వాత కోలుకున్నవారిలో ఇది తగ్గుముఖం పట్టేది. కరోనా వైరస్ గత రూపాల్లో నేరుగా శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్లేది. ఊపిరి తిత్తులు ఎగువ భాగంలో తిష్ట వేసుక్కూర్చుని అక్కటే కోట్లాది కణాలుగా ఏర్పడేది. కోట్ల కొద్దీ ఏర్పడిన వైరస్ కణాలు ఊపిరితిత్తుల గోడలకు ఉండే అతి సూక్ష్మమైన గాలితిత్తులను దెబ్బతీసేవి. దీంతో గోడల భాగం గట్టిపడిపోయేది. ఫలితంగా ఊపిరితిత్తులకు వచ్చే రక్తానికి తగినంత ఆక్సిజన్ అందదు. ఫలితమే ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం.

కానీ, ఒమిక్రాన్ వేరియంట్ లో వైరస్ గొంతు భాగంలోనే ఉంటున్నట్టు ఎయిమ్స్ డాక్టర్ పునీత్ ముస్రా తెలిపారు. గొంతుభాగంలోనే వైరస్ పునరుత్పత్తి చేసుకుంటూ ఉండొచ్చని.. అందుకే శ్వాసపరమైన సమస్య తలెత్తడం లేదన్నారు. దీంతో తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ (న్యూమోనియా) అవకాశాలూ తక్కువేనని చెప్పారు. ఒక వైరస్ రూపాంతరం చెందే కొద్దీ దాని లక్షణాలు కూడా మారడం అసాధారణమేమీ కాదన్నారు.

డెల్టాతో పోలిస్తే 7 రెట్లు అధికంగా ఒమిక్రాన్ రకం వ్యాప్తి చెందే లక్షణం ఉండడం ఒక్కటే అందరినీ ఆందోళనకు గురిచేస్తోందన్నది వాస్తవం. ఒమిక్రాన్ వైరస్ సోకిన వారిలో ప్రధానంగా గొంతు పచ్చిగా, మంటగా, నొప్పిగా అనిపించడం.. బలహీనత (నిస్సత్తువ), శారీరక నొప్పులు కనిపిస్తున్నట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు. కొందరిలో స్వల్పంగా జ్వరం కూడా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News