Kapil Dev: బాలీవుడ్‌లోనూ ‘సిక్స్ కొట్టిన కపిల్ దేవ్.. ‘83’కి అద్భుతమైన రివ్యూలు.. దర్శకుడికి హ్యాట్సాప్!

  • కపిల్‌దేవ్ పాత్రలో ఒదిగిపోయిన రణ్‌వీర్ సింగ్
  • ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దర్శకుడు కబీర్ ఖాన్
  • నాటి ఫైనల్‌ను చూడలేకపోయామని బాధ తీరినట్టే
  • ఐదుకు నాలుగు రేటింగ్ పాయింట్లు సొంతం చేసుకున్న ‘83’
83 Movie got 4 star ratings Ranveer Singh and team hit it out of the park

క్రికెట్‌ను మతంగా పరిగణించే భారతదేశంలో ఈ ఆటకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. దేశంలో ఇప్పుడు క్రీడ అంటే గుర్తొచ్చేది క్రికెట్ ఒక్కటే. కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు దేశానికి వన్డే ప్రపంచకప్ అందించిన తర్వాత ఈ ఆటపై యువతలో మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ప్రపంచంలోని మేటి జట్లలో భారత్ ఒకటి. భారత్ క్రికెట్ ఎంతోమంది దిగ్గజాలను ప్రపంచానికి అందించింది.

ఇక 1983లో కపిల్‌దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ అందుకున్న ఘటనను బాలీవుడ్‌లో ‘83’పేరుతో తెరకెక్కించారు. రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకొణే, పంకజ్ త్రిపాఠీ, అమ్మీ విర్క్, తాహిర్ రాజ్ భాసిన్, నీనా గుప్తా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

కబీర్‌ఖాన్ రూపొందించిన ఈ చిత్రం ఘనమైన రివ్యూలను సొంతం చేసుకుంది. విమర్శకులు సైతం సూపర్ డూపర్ హిట్ అని చెబుతున్నారు. 5 రేటింగ్ పాయింట్లకు నాలుగు సొంతం చేసుకున్న ఈ చిత్రంలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ ఒదిగిపోయాడని చెబుతున్నారు. కబీర్ ఖాన్ అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అప్పట్లో వివాదాల కారణంగా 1983 ప్రపంచకప్ విజయం కెమెరాల్లో నిక్షిప్తం కానప్పటికీ ఇప్పుడా మ్యాచ్‌ను క్రికెట్ ప్రేమికులు ఆస్వాదించేలా సినిమాలో తీర్చిదిద్దారు. కెప్టెన్‌గా కుర్రాళ్లను కపిల్ నడిపించిన తీరును సినిమాలో అత్యద్భుతంగా చూపించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు. పీఆర్ మాన్‌సింగ్‌తో కపిల్ పరిహాసం, సునీల్ గవాస్కర్ (తాహిర్ రాజ్ భాసిన్)తో కపిల్ ఉద్విగ్న క్షణాలు పంచుకున్న తీరు చిత్రానికే హైలైట్ అని చెబుతున్నారు. గవాస్కర్‌తో కపిల్ మాట్లాడే సమయంలో పలికిన పదాలు కొంచెం కటువుగా అనిపిస్తాయి.

ప్రతి సన్నివేశాన్ని చక్కగా తీర్చిదిద్దారు. ప్రతి ఫ్రేమ్ పేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఇక, క్లైమాక్స్‌లో భారత జట్టు ఆడే ప్రతి బంతికి ప్రేక్షకులు చప్పట్లు కొట్టకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదేమో. ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నప్పుడు ప్రేక్షకులు సీట్లలోంచి లేచి మరీ ఆనందాన్ని పంచుకోవడం కనిపించింది.

కథ, స్క్రీన్‌ ప్లే ఎక్కడా దారితప్పకుండా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే నాటి ఫైనల్‌ను చూడలేకపోయామని బాధపడే వారికి ఈ సినిమా చక్కని విందు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, ఇటీవలి కాలంలో ఫోర్ స్టార్స్ రేటింగ్ అందుకున్న ఏకైక సినిమా ఇదే కావడం గమనార్హం.

More Telugu News