Kodali Nani: గుంటూరు లాడ్జిలో సుబ్బారావుపై దాడి.. మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన వైనం.. వీడియో వైరల్

  • కొడాలి నాని, అంబటి రాంబాబు, వంశీలపై వ్యాఖ్యలు
  • శనివారం అర్ధరాత్రి ఆయన ఇంటిపై దాడి
  • ఆదివారం లాడ్జిలో చితకబాది మంత్రికి క్షమాపణలు చెప్పించిన వైనం
  • విషయం తెలిసి దాడిచేయకుండా నిలువరించానన్న మంత్రి బాలినేని
  • దాడి ఘటనపై రెండు కేసుల నమోదు
attack on Ongole ysrcp leader subba rao

మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీల కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించి పార్టీలో కలకలం రేపిన వైసీపీ నేత సుబ్బారావు గుప్తాపై దాడి జరిగింది. ఆయనను తీవ్రంగా కొట్టిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఈ నెల 12న ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.

ఆ కార్యక్రమంలో పాల్గొన్న సుబ్బారావు మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు. వారు అసలు వైసీపీకి హితులో, శత్రువులో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల పార్టీకి 20 శాతం ఓట్లు పోయే ప్రమాదం ఉందన్నారు. వారి కారణంగా పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం ఉందని, ఈసారి టీడీపీ అధికారంలోకి వస్తే తమను కర్రలతో వెంబడించి కొడతారని అన్నారు.

ఆయన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాలినేని అనుచరులు ఆగ్రహంతో ఊగిపోయారు. శనివారం అర్ధరాత్రి గుప్తా ఇంటిపై దాడిచేశారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో భార్యకు వార్నింగ్ ఇచ్చారు. ఇంటి బయట ఉన్న ఆయన ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టారు. అనంతరం సుబ్బారావు గుప్తా గుంటూరులోని ఓ లాడ్జీలో ఉన్న విషయం తెలుసుకుని వాహనాల్లో నిన్న అక్కడికి వెళ్లిన బాలినేని అనుచరులు ఆయనపై దాడిచేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ చావబాదారు.

తనను వదిలేయాలని సుబ్బారావు కాళ్లావేళ్లా పడి వేడుకున్నా వారు కనికరించలేదు సరికదా మరింతగా రెచ్చిపోయారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తామంటూ పిడిగుద్దులు కురిపించారు. ఎవరు చెబితే అలా మాట్లాడావంటూ ప్రశ్నించారు. తనకు ఎవరూ చెప్పలేదని, ఆ రోజు అలా అనుకోకుండా మాట్లాడేశానని, తనను వదిలేయాలని వేడుకున్నా వదిలిపెట్టలేదు.

తాను మొదటి నుంచి పార్టీకి సేవ చేస్తున్నానని, తనకు మధుమేహం ఉందని, వదిలేయాలని ప్రాథేయపడినా వినిపించుకోలేదు. చివరికి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. ఈ మొత్తం ఘటనను వీడియో తీశారు. నిన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాలకెక్కి వైరల్ అయింది.

మరోపక్క, సుబ్బారావుపై దాడి ఘటనపై మంత్రి బాలినేని మాట్లాడుతూ.. గుప్తాకు మతి స్థిమితం లేదన్నారు. గుప్తాపై దాడి జరుగుతున్న విషయం తెలిసి వద్దని తన వాళ్లను వారించానని చెప్పారు. గుప్తాకు అన్ని రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నాయన్న మంత్రి.. గుప్తా వ్యాఖ్యల వెనక టీడీపీ నేత దామచర్ల జనార్దన్ వుండచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇక చంద్రబాబు భార్య భువనేశ్వరిపై తమ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పేనన్నారు. అలా మాట్లాడడం సంస్కారం కాదన్నారు. గతంలో షర్మిలపై టీడీపీకి చెందిన వారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులు పెట్టారని అప్పుడు చంద్రబాబు, ఇతర నేతలు ఎందుకు ఖండించలేదని మంత్రి ప్రశ్నించారు.

మరోవైపు, గుప్తాపై దాడికి నిరసనగా ప్రకాశం జిల్లా పర్చూరు, కనిగిరిలలో ఆర్యవైశ్య సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. గుప్తాపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుబ్బారావు ఇంటిపై దాడి, గుంటూరు లాడ్జిలో ఆయనపై జరిగిన దాడి సంఘటనలకు సంబంధించి ఒంగోలు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

More Telugu News