Vaccine: టీకా వేసుకునేదే లేదంటూ ఆరోగ్య సిబ్బందిని ముప్పుతిప్పలు పెట్టిన వృద్ధుడు

  • సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఘటన
  • టీకా వేసుకోనంటే వేసుకోనంటూ మొండిపట్టుదల
  • ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్న వృద్ధుడు
  • ఉన్నతాధికారులు చెప్పినా వినిపించుకోని వైనం
Elder Man in Suryapet dist refused to get vaccine

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా పాలకవీడులో ఓ వ్యక్తి టీకా వేసుకునేందుకు ససేమిరా అన్నాడు. ఆరోగ్య సిబ్బంది బతిమాలినా, బామాలినా వేసుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. అక్కడితో ఆగక ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొండా చిన్న అచ్చయ్య (65) ఇంటికి వెళ్లారు. టీకా వేసుకోవాలని కోరగా అందుకు ఆయన నిరాకరించాడు. దీంతో టీకా వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆరోగ్య సిబ్బంది ఆయనకు వివరించారు.

అయినప్పటికీ వేసుకునేదే లేదంటూ తేల్చి చెప్పిన అచ్చయ్య లోపలికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఎంపీడీవో జానయ్య, ఎంపీవో దయాకర్ అక్కడికి చేరుకుని అచ్చయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. తలుపులు తీయకపోవడంతో 40 నిమిషాల పాటు ఇంటి వద్ద బైఠాయించారు. అయినప్పటికీ అచ్చయ్య తలుపు తీయకపోవడంతో చేసేది లేక ఆరోగ్య సిబ్బంది వెనుదిరిగారు.

More Telugu News