Hyderabad: హైదరాబాద్‌లో ఘనంగా స్వలింగ సంపర్కుల వివాహం.. తల్లిదండ్రులు, స్నేహితుల కోలాహలం మధ్య వేడుక

Gay Marriage Held in Moinabad Hyderabad
  • మొయినాబాద్ రిసార్ట్‌లో ఘనంగా మెహందీ ఫంక్షన్, సంగీత్
  • తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో వివాహం
  • హాజరైన ఎల్‌జీబీటీ కమ్యూనిటీ సభ్యులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో జరిగిన స్వలింగ సంపర్కుల పెళ్లి అందరినీ ఆకట్టుకుంది. సాధారణ వివాహంలానే బంధుమిత్రుల సమక్షంలో మెహందీ ఫంక్షన్, సంగీత్ నిర్వహించారు. అనంతరం జరిగిన వివాహంతో కోల్‌కతాకు చెందిన సుప్రియో చక్రవర్తి, ఢిల్లీకి చెందిన అభయ్ డాంగ్ ఒక్కటయ్యారు. రిసార్ట్‌లో జరిగిన ఈ వివాహానికి లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జండర్ (ఎల్‌జీబీటీ) కమ్యూనిటీకి చెందిన పలువురు హాజరయ్యారు. సుప్రియో ఉపాధ్యాయుడు కాగా, అభయ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.

తామిద్దరం వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవలే ప్రకటించిన వీరు అనుకున్నట్టే పెద్దల సమక్షంలో ఒక్కటై వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. వివాహం అనంతరం సుప్రియో మాట్లాడుతూ.. 2012లో తనకు అభయ్‌తో పరిచయం అయినట్టు చెప్పారు. ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నెల రోజుల క్రితం నిర్ణయించుకున్నామన్నారు.

ఈ విషయాన్ని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులకు చెబితే మిశ్రమ స్పందన వచ్చిందని చెప్పారు. నిజానికి తమ వివాహానికి చట్టబద్ధత లేదని, అయినప్పటికీ ఘనంగా పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నామని, అనుకున్నట్టే ఘనంగా వివాహం చేసుకున్నామని సుప్రియో వివరించారు.
Hyderabad
Moinabad
LGBT
Gay
Marriage

More Telugu News