KS Shan: కేరళలో ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య... అళప్పుజ జిల్లాలో ఉద్రిక్తత!

Two political leaders murdered in Alappuzha district in Kerala
  • శనివారం రాత్రి కేఎస్ షాన్ హత్య
  • కారుతో ఢీకొట్టిన దుండగులు
  • ఆదివారం ఉదయం రంజిత్ శ్రీనివాస్ హత్య
  • ఇంట్లోకి చొరబడి కడతేర్చిన వైనం
  • హత్యలను ఖండించిన సీఎం విజయన్
  • అళప్పుజ జిల్లాలో 144 సెక్షన్
కేరళలో కొన్ని గంటల వ్యవధిలోనే ఇద్దరు రాజకీయ నాయకులు హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు అళప్పుజ జిల్లాలోనే జరిగాయి. తొలుత ఎస్డీపీఐ (సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) కేరళ విభాగం కార్యదర్శి కేఎస్ షాన్ శనివారం రాత్రి హత్యకు గురికాగా... ఆదివారం ఉదయం బీజేపీ ఓబీసీ మోర్చా కేరళ విభాగం కార్యదర్శి రంజిత్ శ్రీనివాస్ ను చంపేశారు.

కేఎస్ షాన్ గతరాత్రి పార్టీ ఆఫీసు నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు ఆయన బైక్ ను ఢీకొట్టారు. కిందపడిపోయిన షాన్ పై తీవ్రంగా దాడి చేశారు. షాన్ కొచ్చి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక, ఈ ఉదయం రంజిత్ శ్రీనివాస్ ను దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి మరీ అంతమొందించారు. షాన్ హత్యకు ప్రతీకారంగానే కొన్ని గంటల వ్యవధిలోనే రంజిత్ హత్య జరిగినట్టు భావిస్తున్నారు.

ఈ హత్యలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ రెండు హత్యలతో అళప్పుజ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా జిల్లాలో 144 సెక్షన్ విధించారు.
KS Shan
Ranjit Srinivas
Murder
Alappuzha District
Kerala

More Telugu News