Omicron: తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసుల వెల్లడి

Twelve more Omicron positive cases identified in Telangana
  • విదేశాల నుంచి వచ్చిన 12 మంది
  • వారిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి రాక
  • తెలంగాణలో 20కి పెరిగిన ఒమిక్రాన్ కేసులు
  • మహారాష్ట్రలోనూ ఒమిక్రాన్ కలకలం
దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికి అధికమవుతోంది. తెలంగాణలో మరో 12 ఒమిక్రాన్ కేసులు వెల్లడయ్యాయి. వీరందరూ విదేశాల నుంచి తెలంగాణకు వచ్చినవారే. వీరిలో ఇద్దరు ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినట్టు గుర్తించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణ ఒమిక్రాన్ కేసుల సంఖ్య 20కి పెరిగింది.

కాగా, కెన్యా నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ఒమిక్రాన్ రోగి కోసం తీవ్రంగా గాలించిన పోలీసులు చివరికి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాహి ఇబ్రహీం అనే 44 ఏళ్ల వ్యక్తి డిసెంబరు 14న హైదరాబాద్ వచ్చాడు. ఎయిర్ పోర్టులో అతడికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల అనంతరం అతడికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అయితే అతడు టోలీచౌకిలో నివాసం ఉంటున్నాడని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి చూడగా, అతడు కనిపించలేదు. దీనిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, తీవ్రస్థాయిలో వేట సాగించిన పోలీసులు... అపోలో ఆసుపత్రి సమీపంలో ఉన్న ఓ గెస్ట్ హౌస్ లో అతడిని దొరకబుచ్చుకున్నారు. అనంతరం ఆ కెన్యా దేశస్థుడిని టిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

అటు మహారాష్ట్రలో కొత్తగా 8, కర్ణాటకలో 6, కేరళలో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
Omicron
New Variant
Telangana
New Cases

More Telugu News