ఐపీఎల్ లో లక్నో ఫ్రాంచైజీ మెంటార్ గా గౌతమ్ గంభీర్ నియామకం

18-12-2021 Sat 20:32
  • 2022 ఐపీఎల్ లో కొత్తగా లక్నో, అహ్మదాబాద్ జట్లు
  • జట్టు నిర్మాణంపై దృష్టిపెట్టిన లక్నో
  • కొత్త పాత్రలో గంభీర్
  • గతంలో కేకేఆర్ కు రెండుసార్లు టైటిల్ అందించిన గంభీర్
Gautam Gambhir appointed as Lucnow franchise mentor
వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ తాజా సీజన్ లో రెండు కొత్త జట్లు కూడా ఆడుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న 8 ఫ్రాంచైజీలకు తోడు, కొత్తగా లక్నో, అహ్మదాబాద్ ఫ్రాంచైజీలకు ఐపీఎల్ పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, లక్నో ఫ్రాంచైజీ యాజమాన్యం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం ఆండీ ఫ్లవర్ ను కోచ్ గా నియమించిన లక్నో... భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను మెంటార్ గా నియమించింది. లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా ఈ విషయాన్ని నిర్ధారించారు.

గౌతమ్ గంభీర్ కు ఐపీఎల్ లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో కోల్ కతా నైట్ రైడర్స్ కు సారథ్యం వహించిన గంభీర్... ఆ జట్టుకు రెండుసార్లు టైటిల్ అందించాడు. గంభీర్ నాయకత్వంలో కేకేఆర్ 2012, 2014లో ఐపీఎల్ విజేతగా నిలిచింది. అంతేకాదు, ఐపీఎల్ లో మొత్తం 154 మ్యాచ్ లు ఆడిన గంభీర్... 31.23 సగటుతో 4,217 పరుగులు సాధించాడు. అందులో 36 అర్ధసెంచరీలు ఉన్నాయి.

కాగా, తనను లక్నో ఫ్రాంచైజీ మెంటార్ గా నియమించడం పట్ల గంభీర్ స్పందించాడు. ఐపీఎల్ లో మళ్లీ అడుగుపెడుతుండడం ఓ గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు. లక్నో టీమ్ మెంటార్ గా తనను నియమించినందుకు డాక్టర్ గోయెంకాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు.

గెలవాలన్న కసి తనలో ఇంకా రగులుతూనే ఉందని గంభీర్ అన్నాడు. ఏ జట్టుకు పనిచేసినా గెలుపు వారసత్వాన్నే అందించాలన్న ఆకాంక్ష తనను మరింత ముందుకు నడిపిస్తోందని వివరించాడు. ఇప్పుడు తాను ఆటగాడిగా డ్రెస్సింగ్ రూంలో అడుగుపెట్టడం లేదని, కానీ ఉత్తరప్రదేశ్ స్ఫూర్తి, ఆత్మను మరింత విస్తరించేందుకు కృషి చేస్తానని ఉద్ఘాటించాడు.

కాగా, మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం నిర్వహించనున్న నేపథ్యంలో, స్టార్ ఆటగాళ్లను తీసుకోవాలని లక్నో యాజమాన్యం భావిస్తోంది. కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను తీసుకోవడం దాదాపు ఖరారైనట్టేనని ప్రచారం జరుగుతోంది.