Bharat Bhushan Kataria: న్యాయవాదిని చంపేందుకు కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చిన డీఆర్డీవో శాస్త్రవేత్త అరెస్ట్

Police arrests DRDO scientist for planting bomb in court to kill an advocate
  • శాస్త్రవేత్తకు, న్యాయవాదికి మధ్య వివాదాలు
  • ఒకరిపై ఒకరు కేసుల నమోదు
  • స్వయంగా ఐఈడీ బాంబు తయారుచేసిన శాస్త్రవేత్త
  • ఢిల్లీ రోహిణి కోర్టులో ఈ నెల 9న పేలుడు
  • ఒక పోలీసుకు గాయాలు
ఇటీవల ఢిల్లీలోని రోహిణి కోర్టులో స్వల్ప స్థాయి పేలుడు సంభవించడం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఓ న్యాయవాదిని చంపేందుకే ఈ పేలుడుకు పాల్పడినట్టు గుర్తించారు. ఆ న్యాయవాదిని చంపాలనుకుంది డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్)కు చెందిన ఓ శాస్త్రవేత్త అని వెల్లడైంది.

కోర్టులో ఓ విచారణకు సదరు న్యాయవాది హాజరు అవుతాడని అంచనా వేసిన డీఆర్డీవో శాస్త్రవేత్త కోర్టులో టిఫిన్ బాక్స్ బాంబు అమర్చినట్టు పోలీసులు తెలిపారు. ఆ శాస్త్రవేత్త పేరు భరత్ భూషణ్ కఠారియా అని, ఆయన చంపాలనుకున్న న్యాయవాది పేరు అమిత్ వశిష్ట్ అని వెల్లడించారు.

వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా అనేక న్యాయపోరాటాలు సాగుతున్నాయి. డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ పై న్యాయవాది అమిత్ వశిష్ట్ 7 కేసులు పెట్టగా... ఆ న్యాయవాదిపై భరత్ భూషణ్ 5 కేసులు పెట్టాడు. వీరిద్దరూ ఇరుగుపొరుగు వారేనని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడైంది.

ఓ వివాదంలో న్యాయవాది వైఖరితో రగిలిపోతున్న భరత్ భూషణ్... అతడిని అంతమొందించాలని భావించి స్వయంగా ఐఈడీ బాంబు తయారుచేశాడని, దాన్ని కోర్టులోని 102వ నెంబరు గదిలో అమర్చాడని పోలీసులు వివరించారు. డిసెంబరు 9న జరిగిన పేలుడు ఘటనలో ఒక పోలీసు గాయపడ్డాడు. కాగా, ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న ఢిల్లీ పోలీస్ విభాగం స్పెషల్ సెల్ (నార్తర్న్ రేంజి) అధికారులు డీఆర్డీవో శాస్త్రవేత్త భరత్ భూషణ్ కఠారియాను అరెస్ట్ చేశారు.
Bharat Bhushan Kataria
Scientist
DRDO
Amit Vashistht
Bomb
Rohini Court
New Delhi

More Telugu News