Rajamouli: మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే టెన్షన్ సార్: బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' కార్యక్రమంలో రాజమౌళి

Rajamouli attends Balakrishna Unstoppable talk show on Aha
  • 'ఆహా ఓటీటీలో 'అన్ స్టాపబుల్' టాక్ షో
  • హోస్ట్ గా బాలకృష్ణ
  • కార్యక్రమానికి విచ్చేసిన రాజమౌళి, కీరవాణి
  • ఆసక్తికర ప్రశ్నలు అడిగిన బాలయ్య
టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ కార్యక్రమంతో దూసుకుపోతున్నారు. ప్రముఖులను బాలకృష్ణ ఇంటర్వ్యూ చేసే విధానం విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే కార్యక్రమానికి టాలీవుడ్ అగ్రశ్రేణి దర్శకుడు రాజమౌళి, సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి విచ్చేశారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ, మనిద్దరం ఇంతవరకు కలిసి పనిచేయలేదు అంటూ రాజమౌళిని ఉద్దేశించి అన్నారు. "బాలయ్యతో సినిమా ఎప్పుడు ఉంటుంది అని నా అభిమానులు అడిగితే నా వల్ల కాదు అన్నారట!" అంటూ బాలకృష్ణ అడిగారు. అందుకు రాజమౌళి సమాధానం ఇస్తూ, మిమ్మల్ని డైరెక్ట్ చేయాలంటే టెన్షన్ సార్ అంటూ బదులిచ్చారు.

"సెట్స్ మీద నా పద్ధతి విభిన్నంగా ఉంటుంది. హీరో పరిస్థితిని పట్టించుకోను. వానకు తడుస్తున్నాడా? ఎండలో ఉన్నాడా? అనేది చూడను, నా షాట్ గురించే ఆలోచిస్తుంటాను. ఎవరైనా గుడ్ మార్నింగ్ అన్నా సరే చికాకు వేస్తుంది. షాట్ రెడీ అయ్యేంతవరకు నా ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఈ పద్ధతిలో వెళ్లే నేను మిమ్మల్ని ఏవిధంగా డైరెక్ట్ చేయగలను? ఒకవేళ మీకు కోపం వస్తే... అదే నా భయం" అంటూ రాజమౌళి వివరణ ఇచ్చారు.

అందుకు బాలకృష్ణ కూడా తనదైన శైలిలో స్పందన వెలిబుచ్చారు. ఒక్కసారి కారవాన్ లోంచి దిగి మళ్లీ కారవాన్ లోకి ఎక్కేంత వరకు దర్శకుడు ఎలా చెబితే అలా నడుచుకుంటానని స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తయ్యాకే తిరిగి కారవాన్ లో అడుగుపెడతానని, స్పాట్ లో గొడుగు కూడా పట్టనివ్వనని వివరణ ఇచ్చారు.
Rajamouli
Unstoppable
Balakrishna
Aha OTT
Tollywood

More Telugu News