Telangana: తెలంగాణ ఇంటర్మీడియ‌ట్ బోర్డు కార్యాలయం వ‌ద్ద తీవ్ర‌ ఉద్రిక్త‌త‌

  • ఇంట‌ర్ ఫ‌లితాలపై వివాదం
  • ఇంట‌ర్ బోర్డును ఏబీవీపీ ముట్ట‌డి
  • కార్య‌క‌ర్త‌లు, పోలీసుల‌కు మ‌ధ్య తోపులాట
ruckus at inter board

క‌రోనా స‌మ‌యంలో నిర్వ‌హించ‌లేక‌పోయిన ఇంట‌ర్ ప్ర‌థ‌మ సంవ‌త్స‌ర‌ ప‌రీక్ష‌ల‌ను తెలంగాణ‌ ఇంటర్మీడియ‌ట్ బోర్డు ఇటీవ‌ల నిర్వ‌హించి ఫ‌లితాలు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంట‌ర్ రెండో సంవ‌త్స‌రం చ‌దువుతోన్న విద్యార్థులు.. గ‌త ఏడాది రాయ‌లేక‌పోయిన ప్ర‌థ‌మ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌లు రాశారు. క‌రోనా కార‌ణంగా వారు స‌రిగ్గా చ‌దువుకోలేక‌పోవ‌డంతో అధిక శాతం మంది ఉత్తీర్ణులు కాలేక‌పోయారు. దీంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొన‌డంతో ఈ రోజు ఇంట‌ర్ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించడానికి ఏబీవీపీ కార్యకర్తలు ప్ర‌య‌త్నించారు.

ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలను నిరసిస్తూ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు ప‌రిస్థితులు అదుపుత‌ప్ప‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జ‌రిగి గంద‌ర‌గోళం నెల‌కొంది. ఏబీవీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.

ఇంట‌ర్ బోర్డు ఫ‌లితాల వ‌ల్ల విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో ఆందోళ‌న నెల‌కొన‌డంతో బోర్డు కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్త‌కుండా పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా, ఇప్ప‌టికే రీ-వాల్యుయేష‌న్ తేదీల‌ను ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది. అందుకుగాను ఫీజును కూడా త‌గ్గించామ‌ని తెలిపింది.

అయితే, ఈ ప‌రీక్ష‌ల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌ట్లేదు. వారు వ‌చ్చే ఏడాది నిర్వ‌హించే ప‌రీక్షల స‌మ‌యంలోనే ప్ర‌థ‌మ సంవ‌త్స‌ర‌ ప‌రీక్ష‌లు రాయాల్సి ఉంటుంది. మెయిన్ ప‌రీక్ష‌ల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డంతో, స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌లేమ‌ని అధికారులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. దీంతో రీ-వాల్యుయేష‌న్‌ను ఉచితంగా నిర్వ‌హించాల‌ని, విద్యార్థుల‌కు న్యాయం చేయాల‌ని విద్యార్థి సంఘాల నేత‌లు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News