Bandi Srinivasarao: 50 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం: ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు

Employees held protests at Dharna Chowk in Vijayawada
  • విజయవాడలో ఉద్యోగ సంఘాల జేఏసీ ధర్నా
  • ప్రభుత్వం ముందు పలు డిమాండ్లు ఉంచిన నేతలు
  • ఇటీవల పీఆర్సీపై సీఎస్ కమిటీ నివేదిక
  • తమకు ఆమోదయోగ్యం కాదంటున్న ఉద్యోగులు
ఇటీవల ఏపీ సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ పీఆర్సీపై నివేదిక రూపొందించి సీఎం జగన్ కు సమర్పించడం తెలిసిందే. ఈ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్ మెంట్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో, విజయవాడ ధర్నా చౌక్ లో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నేడు ధర్నా నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, 50 శాతం ఫిట్ మెంట్ కావాలని ప్రభుత్వాన్ని అడుగుతున్నామని తెలిపారు. కనీస వేతనం రూ.23 వేలు ఉండాలని స్పష్టం చేశారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మూల వేతనం పెంచాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ రూ.23 లక్షలకు పెంచాలని కోరారు. ప్రభుత్వం స్పందిస్తేనే తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని బండి శ్రీనివాసరావు తమ వైఖరిని తెలిపారు.

ఉద్యోగుల జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ, పీఆర్సీ నివేదిక పాక్షికంగా ఇచ్చారని ఆరోపించారు. మిగిలిన నివేదికలు కూడా ఇవ్వాలని స్పష్టం చేశారు. 11వ పీఆర్సీ నివేదికను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులతో కమిటీ వేసి ఇష్టానుసారం నివేదిక ఇచ్చారని బొప్పరాజు పేర్కొన్నారు.

ఏమైనా అధికారుల నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. 14.29 శాతం ఫిట్ మెంట్ కుదరదని చెప్పామని తెలిపారు. అధికారులు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, ఫిట్ మెంట్ అంశంపై సీఎంతోనే చర్చిస్తామని ఉద్ఘాటించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Bandi Srinivasarao
AP NGO
Bopparaju
PRC
Fitment
Andhra Pradesh

More Telugu News