Virat Kohli: జస్ట్ గంటన్నర ముందే చెప్పారు.. కెప్టెన్సీ తప్పించడం, రోహిత్ తో విభేదాలపై తొలిసారి విరాట్ కోహ్లీ స్పందన

Virat First Response On Disputes With Rohit and ODI Captaincy
  • ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు
  • వన్డే కెప్టెన్సీ విషయంలో నేను క్లారిటీగా ఉన్నా
  • రోహిత్ సమర్థుడు.. వ్యూహాత్మకంగా జట్టును నడిపిస్తాడు
  • అతడికి, నాకు విభేదాలేమీ లేవు
  • రెండేళ్లుగా ఇదే చెబుతున్నా.. చెప్పిచెప్పి అలసిపోయా
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై విరాట్ కోహ్లీ తొలిసారి స్పందించాడు. తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్టు కేవలం గంటన్నర ముందే చెప్పారని స్పష్టం చేశాడు. సౌతాఫ్రికా టూర్ నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ నేపథ్యంలోనే వన్డేలకూ తాను అందుబాటులో ఉంటానని తెలిపాడు.

‘‘టెస్ట్ జట్టు ఎంపిక సమయంలోనే సెలెక్టర్లు నా వన్డే కెప్టెన్సీపై మాట్లాడారు. నాతో టెస్టు జట్టు గురించి చీఫ్ సెలెక్టర్ మాట్లాడారు. అంతా అయిపోయాక.. నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఐదుగురు సెలెక్టర్లు నిర్ణయించారని చెప్పారు. దాని గురించి నాకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’’ అని వెల్లడించాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20లకు కెప్టెన్ గా ఉండనన్న తన నిర్ణయాన్ని బీసీసీఐ స్వాగతించిందని చెప్పాడు.

మరోమారు ఆలోచించకుండా తన నిర్ణయాన్ని అంగీకరించిందని, చాలా మంచి నిర్ణయమంటూ మెచ్చుకుందని గుర్తు చేశాడు. ఆ సమయంలోనే వన్డేలు, టెస్టులకు నాయకత్వం వహిస్తానంటూ బీసీసీఐకి చెప్పానన్నాడు. ఈ విషయంలో తాను చాలా స్పష్టంగా ఉన్నానని తెలిపాడు. అయితే, తాను వేరే ఫార్మాట్లకు నాయకత్వం వహించలేనని సెలెక్టర్లు భావిస్తే తానేమీ చేయలేనన్నాడు.

దాంతో పాటు వన్డేలో ఆడట్లేదన్న విషయంపైనా కోహ్లీ క్లారిటీ ఇచ్చేశాడు. సౌతాఫ్రికాతో వన్డేలూ ఆడుతున్నానని తేల్చి చెప్పాడు. చాలా మంది అబద్ధాలు రాస్తున్నారని, తానెప్పుడూ విశ్రాంతి కావాలంటూ ఎవరినీ అడగలేదని వెల్లడించాడు. రోహిత్ చాలా మంచి నాయకుడని, జట్టును సమర్థవంతంగా, వ్యూహాత్మకంగా నడిపించడంలో దిట్ట అని కొనియాడాడు. రాహుల్ ద్రావిడ్ ఓ గొప్ప వ్యక్తి అన్నాడు.

తన వంతుగా జట్టును ముందుకు నడిపించేందుకే తాను కృషి చేస్తానని, వన్డేలు, టీ20ల్లో రోహిత్ కు వంద శాతం అండగా నిలుస్తానని స్పష్టం చేశాడు. తనకు, రోహిత్ కు మధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పాడు. రెండేళ్లుగా ఇదే విషయం చెబుతున్నానని, చెప్పి చెప్పి అలసిపోయానని అన్నాడు. తనను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై బీసీసీఐ చెబుతున్న కారణాలను అర్థం చేసుకోగలనని తెలిపాడు. జట్టును హీన స్థితికి తీసుకెళ్లేలా తన నిర్ణయాలుండవని కోహ్లీ స్పష్టం చేశాడు.
Virat Kohli
Rohit Sharma
Cricket
Team India
BCCI

More Telugu News