Kerala: కొట్టాయంలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి.. నేటి నుంచి వేలాది పక్షుల సామూహిక హననం

Keralas Kottayam reports 3 bird flu cases mass culling begins today
  • బాతులు, కోళ్లను చంపి తగలబెట్టేందుకు బృందాలు
  • ఇప్పటికే వేలాది బాతుల మృత్యువాత
  • మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే ప్రమాదం తక్కువే
  • సంక్రమిస్తే మాత్రం ఇబ్బందే
కేరళలోని కొట్టాయం జిల్లాలో మూడు బర్డ్ ఫ్లూ కేసులు బయటపడ్డాయి. అప్రమత్తమైన అధికారులు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నేటి నుంచి కోళ్లు, బాతులను సామూహిక హననం చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వేచూర్, అయమనమ్, కల్లార పంచాయతీలలో పక్షుల నుంచి సేకరించిన నమూనాలను భోపాల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐ‌హెచ్ఎస్ఏడీ)లో పరీక్షించగా బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది.

వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ డాక్టర్ పీకే జయశ్రీ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, గతవారం పక్కనే ఉన్న అలప్పుజ జిల్లాలోనూ బర్డ్ ఫ్లూ వెలుగులోకి రాగా నియంత్రణ చర్యల్లో భాగంగా పక్షులను చంపేశారు. తాజా కేసులతో కోళ్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. అలప్పుజలో బాతులను చంపి తగలబెట్టేశారు. ఇప్పుడు కొట్టాయంలోనూ ఇలాగే చేయాలని అధికారులు నిర్ణయించారు.

గత కొన్ని వారాలుగా అలప్పుజలో బాతులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. ఒక్క పంచాయతీలోనే ముగ్గురు రైతులకు చెందిన 8 వేలకు పైగా బాతులు మృత్యువాత పడ్డాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కొట్టాయంలో రాకుండా చూడాలని యంత్రాంగం భావిస్తోంది. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సోకే ప్రమాదం తక్కువగానే ఉన్నప్పటికీ, సంక్రమిస్తే మాత్రం సమస్యలు తప్పవు.

పక్షుల సామూహిక హననం కోసం ఇప్పటికే పలు బృందాలు ఆయా గ్రామాలకు చేరుకున్నాయి. ప్రతి బృందంలో ఓ పశువైద్యుడు, ఒక పర్యవేక్షకుడు, ముగ్గురు సహాయకులు ఉంటారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ కనుక నిర్ధారణ అయితే 28,500 నుంచి 35,000 పక్షులను చంపేయాల్సి ఉంటుంది.
Kerala
Kottayam
Bird Flu
Mass Culling

More Telugu News