Virat Kohli: విరామం కావాలని కోహ్లీ మమ్మల్ని ఇంతవరకు కోరలేదు: బీసీసీఐ అధికారి

BCCI top official clarifies Kohli plays ODI series against South Africa
  • దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కోహ్లీ దూరం అంటూ వార్తలు
  • దీనిపై తమకేమీ సమాచారం లేదన్న బోర్డు అధికారి
  • కోహ్లీ వన్డే సిరీస్ లో ఆడుతున్నాడని వెల్లడి
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు విరాట్ కోహ్లీ దూరమవుతున్నట్టు వార్తలు రావడం తెలిసిందే. దీనిపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. వన్డే సిరీస్ నుంచి తనకు విశ్రాంతి కావాలని కోహ్లీ తమను కోరలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఇప్పటివరకు కోహ్లీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన అందలేదని వెల్లడించారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కానీ, బోర్డు కార్యదర్శి జై షాకి కానీ ఎలాంటి సమాచారం అందించలేదని వివరించారు.

"ఒకవేళ కోహ్లీ గాయంతో బాధపడుతుంటే అది వేరే విషయం. కానీ ఈ క్షణం వరకు మావద్ద ఉన్న సమాచారం మేరకు కోహ్లీ వచ్చే జనవరిలో 19, 21, 23 తేదీల్లో జరిగే వన్డేల్లో ఆడుతున్నాడు" అని ఆ అధికారి వెల్లడించారు. దక్షిణాఫ్రికా పర్యటనకు కోహ్లీ తన కుటుంబంతో వస్తున్నాడని, ఒకవేళ బయోబబుల్ కారణంగా అలసటకు గురయ్యానని భావిస్తే తప్పకుండా చీఫ్ సెలెక్టర్ కు గానీ, బోర్డు కార్యదర్శి, సెలెక్షన్ కమిటీ కన్వీనర్ (జై షా)కు గానీ సమాచారం అందిస్తాడని తెలిపారు.
Virat Kohli
ODI Series
BCCI
South Africa
Team India

More Telugu News