Manohari Gold Tea: మనోహరి గోల్డ్ టీ... కేజీ ఎంతో తెలుసా..?

Manohari Gold Tea fetches record price in auction
  • అసోంలో మాత్రమే పండే అరుదైన తేయాకు
  • దిబ్రూగఢ్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ లో సాగు
  • వేలంలో కిలో రూ.99,999 పలికిన మనోహరి టీ
  • గతంలో రూ.75 వేలు పలికిన వైనం

అసోం రాష్ట్రం నుంచి ఉత్పత్తి అయ్యే తేయాకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. అసోం తేయాకు నుంచి తయారైన కొన్ని నాణ్యమైన టీ పొడులు అదిరిపోయే ధర పలుకుతాయి. వీటిలో మనోహరి గోల్డ్ టీ ఒకటి. దీన్ని అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఉన్న మనోహరి టీ ఎస్టేట్ లో మాత్రమే పండిస్తారు.

తాజాగా దీన్ని వేలం వేయగా, రికార్డు స్థాయిలో కిలో రూ.99,999కి అమ్ముడైంది. సౌరవ్ టీ ట్రేడర్స్ కు చెందిన మంగీలాల్ మహేశ్వరి అనే వ్యాపారి మనోహరి గోల్డ్ టీ తాజా పంటను కొనుగోలు చేశారు. గతంలో ఇది కిలో రూ.75 వేల ధర పలికింది. ఇప్పుడు మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే సరికొత్త ధరతో తిరగరాసింది.

దీనిపై గౌహతి టీ ఆక్షన్ బయ్యర్స్ అసోసియేషన్ (జీటీఏబీఏ) కార్యదర్శి దినేశ్ బిహానీ మీడియాతో మాట్లాడారు. టీ వేలంలో ఇదొక వరల్డ్ రికార్డు అని వెల్లడించారు. ఓ తేయాకు బ్రాండ్ కు ఈ స్థాయిలో ధర లభించడం పట్ల తాము గర్విస్తున్నామని తెలిపారు. దిబ్రూగఢ్ జిల్లాలోని మనోహరి టీ ఎస్టేట్ లో పండే ఈ తేయాకు ఎంతో ప్రత్యేకమైనది, అరుదైనదని పేర్కొన్నారు. భవిష్యత్తులో అసోం తేయాకు రైతులు మనోహరి తరహా తేయాకుతో పాటు వైట్ టీ, ఊలాంగ్ టీ, గ్రీన్ టీ, యెల్లో టీ రకాలను కూడా పండిస్తారని ఆశిస్తున్నట్టు దినేశ్ బిహానీ తెలిపారు.

  • Loading...

More Telugu News