FAO: క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిసిన ఐక్యరాజ్యసమితి బృందం

UN FAO reps met CM Jagan in Tadepalli camp office
  • ఏపీకి విచ్చేసిన ఎఫ్ఏఓ, ఐసీఏఆర్ ప్రతినిధులు
  • సీఎం జగన్ తో చర్చలు
  • ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం
  • ఏపీలో వ్యవసాయ రంగానికి తోడ్పాటు
ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సభ్యులు నేడు ఏపీ సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎఫ్ఏఓ బృందం వెంట ఐసీఏఆర్ (భారత వ్యవసాయ పరిశోధన మండలి) ప్రతినిధులు కూడా ఉన్నారు. సీఎం జగన్ తో చర్చల అనంతరం ఏపీ ప్రభుత్వంతో ఎఫ్ఏఓ ఒప్పందం కుదుర్చుకుంది.

ఎఫ్ఏఓ తరఫున ఆ సంస్థ భారత విభాగం డైరెక్టర్ టోమియో షిచిరి, ఐసీఏఆర్ తరఫున డిప్యూటీ డీజీ డాక్టర్ ఏకే సింగ్, ఏపీ ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

సుస్థిర వ్యవసాయం, ఆహార వ్యవస్థల ఏర్పాటు, రాష్ట్రంలో రైతుల నైపుణ్యాభివృద్ధి అంశాల్లో ఏపీ ప్రభుత్వానికి ఎఫ్ఏఓ సాంకేతిక సహకారం అందించనుంది. ఎఫ్ఏఓ ఇందులో భాగంగా రైతు భరోసా కేంద్రాలకు సాంకేతికంగా, ఆర్థికంగా సాయం అందించనుంది. అందుకు ఐసీఏఆర్ కూడా తోడ్పాటు అందించనుంది. అంతేకాదు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానంపై రైతులు, ఆర్బీకే సిబ్బంది, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎఫ్ఏఓ శిక్షణ ఇవ్వనుంది. ఉత్తమ సాగు యాజమాన్య పద్ధతులపై రైతులకు ఎఫ్ఏఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు.

ఎఫ్ఏఓ అంటే... ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తుంది. అందరికీ ఆహార భద్రత కోసం ఎఫ్ఏఈ అంతర్జాతీయంగా కృషి చేస్తోంది.
FAO
UN
CM Jagan
ICAR
Andhra Pradesh

More Telugu News