Allu Arjun: తమిళ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్స్ వీళ్లే: చెన్నైలో అల్లు అర్జున్

Allu Arjun reveals who is best dancers in Tamil cinema
  • ఈ నెల 17న పుష్ప రిలీజ్
  • ప్రమోషన్ ఈవెంట్లతో చిత్రబృందం బిజీ
  • చెన్నైలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్
  • తమిళంలోనే మాట్లాడిన బన్నీ
పుష్ప చిత్రం ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం ముమ్మరంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. హీరో అల్లు అర్జున్ నేడు చెన్నైలో పుష్ప ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ప్రసంగం తమిళంలోనే సాగింది.

తన చిత్రాలు బాలీవుడ్ లోనూ డబ్ అవుతుంటాయని, అయితే తనకు తమిళనాడులో మంచి నటుడిగా గుర్తింపు పొందాలన్నది ఓ కోరిక అని తెలిపారు. తన సినిమాలు తమిళనాడులోనూ విజయం సాధించాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. పుష్ప చిత్రంతో తన ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నానని, ఈ సినిమా పాటలు తమిళనాడు ప్రజలను బాగా ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. తన ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన పాటలు ఇచ్చారని, అందుకే ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

ఇక, "మీరు మంచి డ్యాన్సర్ కదా, తమిళంలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు?" అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, బన్నీ సమాధానమిచ్చారు. మునుపటి తరంలో కమల్ హాసన్ సర్ అద్భుతమైన డ్యాన్సర్ అని కొనియాడారు. ఆ తర్వాతి తరంలో విజయ్, ఇప్పటి జనరేషన్ లో ధనుష్, శింబు, ఇతర యువ హీరోలంతా మంచి డ్యాన్సర్లేనని పేర్కొన్నారు. తాను తమిళ సినిమాలు కూడా చూస్తుంటానని తెలిపారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన 'డాక్టర్' చిత్రాన్ని చూశానని, బాగా నచ్చిందని వెల్లడించారు.

బన్నీ పెరిగింది చెన్నైలోనే కావడంతో తమిళంలో అనర్గళంగా మాట్లాడగలరు. ఇవాళ ప్రెస్ మీట్లోనూ ఎక్కడా తడబాటు లేకుండా తమిళంలో మాట్లాడారు.
Allu Arjun
Pushpa
Chennai
Kollywood
Tollywood

More Telugu News