TSRTC: తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు 200 బస్సులు: టీఎస్ఆర్టీసీ

TSRTC said good news for Sabarimala devotees
  • బస్సులోని భక్తులందరూ ఒకేసారి దర్శనం చేసుకునే ఏర్పాటు
  • బస్సును బుక్ చేసుకుంటే గురుస్వామితోపాటు ఆరుగురికి ఉచిత ప్రయాణం
  • బస్సు బుకింగ్ రద్దు చార్జీల సవరణ
తెలంగాణ నుంచి శబరిమల వెళ్లే భక్తులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 200 ప్రత్యేక బస్సులను శబరిమలకు నడపనున్నట్టు తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులందరూ ఒకేసారి స్వామి దర్శనం చేసుకునే వెసులుబాటును కూడా కల్పించినట్టు చెప్పారు. అలాగే, బస్సును ముందుగానే బుక్ చేసుకుంటే కనుక గురుస్వామితోపాటు మరో ఆరుగురికి ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుందన్నారు.

బస్సు బుకింగ్ రద్దు చార్జీలను కూడా సవరించామని సజ్జనార్ చెప్పారు. 48 గంటల ముందు కనుక బుకింగ్ రద్దు చేసుకుంటే మునుపటి మాదిరిగానే రూ. 1,000 వసూలు చేస్తారని తెలిపారు. 24 నుంచి 48 గంటల లోపు రద్దు చేసుకుంటే గతంలో అద్దె మొత్తంలో 10 శాతాన్ని మినహాయించేవారు. అయితే, ఇక నుంచి రూ. 5 వేలు మాత్రమే మినహాయించుకుని మిగతాది చెల్లిస్తారు.

అలాగే, 24 గంటల నుంచి బస్సు బయలుదేరే సమయం ముందు వరకు రద్దు చేసుకుంటే గతంలో 30 శాతం వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని రూ. 10 వేలకు పరిమితం చేసినట్టు సజ్జనార్ వివరించారు. ప్రత్యేక బస్సులు, ఇతర వివరాల కోసం 040-30102829లో సంప్రదించాలని కోరారు.
TSRTC
VC Sajjanar
Sabarimala
Kerala

More Telugu News