అంతకంతకూ అంచనాలు పెంచుతున్న 'పుష్ప'

13-12-2021 Mon 19:07
  • అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' 
  • సుకుమార్ తో మూడో సినిమా 
  • ఈ నెల 17న భారీ విడుదల 
  • హ్యాట్రిక్ హిట్ పైనే అందరి దృష్టి  
Pushpa movie update
దర్శకుడిగా సుకుమార్ కెరియర్ 'ఆర్య' సినిమాతోనే మొదలైంది. ఆ సినిమా బన్నీ కెరియర్ కి ఎంతో హెల్ప్ చేసింది. అందువలన అప్పటి నుంచి బన్నీ .. సుకుమార్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి చేసిన 'ఆర్య 2' కూడా మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉండటం వలన కలిసి పని చేయడం కుదరలేదు.

ఇక ఈ సారి మాత్రం అడవి నేపథ్యంలో సాగే కథను పట్టుకుని ఇద్దరూ రంగంలోకి దిగిపోయారు. అలా సెట్స్ పైకి వెళ్లిన 'పుష్ప' సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ వస్తూనే ఉంది. సినిమాపై అంచనాలు పెంచుతూనే ఉంది. బన్నీ లుక్ బయటికి రావడంతో మొదలైన విశేషాలు చివరి వరకూ ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చాయి. చివరిలో సమంత ఐటమ్ సాంగ్ ను షూట్ చేసి మరీ తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఒక వైపున అడవి నేపథ్యం .. మరో వైపున గ్రామీణ వాతావరణం .. ప్రమాదం అంచుల్లో ప్రయాణం .. అలాంటి పరిస్థితుల్లోనే ప్రణయం .. తూకం వేసినట్టుగా కనిపిస్తున్న పాటలు - ఫైట్లు, ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'అఖండ'తో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అలాగే బన్నీ - సుకుమార్ కూడా ఈ నెల 17న రానున్న ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకుంటారేమో చూడాలి.