Sania Mistri: కష్టాలకు ఎదురొడ్డి.. ర్యాపర్‌గా ప్రభంజనం సృష్టిస్తున్న 15 ఏళ్ల రిక్షా డ్రైవర్ కుమార్తె!

  • ముంబైలోని గోవండి ప్రాంతానికి చెందిన సానియా మిస్త్రీ
  • తండ్రి రిక్షా డ్రైవర్, తల్లి కూలీ
  • టీనేజ్ ర్యాపర్‌గా దూసుకెళ్తున్న మిస్త్రీ
  • సొంత ఫోన్ కూడా లేకుండానే వీడియోలు
  • కలలను నిజం చేసుకుంటానన్న నమ్మకం ఉందన్న టీనేజర్
  • తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు
Rickshaw drivers 15 year old daughter from Mumbai become a rapper

ఎదగాలన్న తపన, కాస్తంత పట్టుదల ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని చెప్పేందుకు బోల్డన్ని ఉదాహరణలు ఉన్నాయి. అడ్డంకులను ఎదురొడ్డిన ఎంతోమంది నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నారు. ముంబైకి చెందిన 15 ఏళ్ల సానియా మిస్త్రీ ఇప్పుడీ జాబితాలో చోటు సంపాదించుకుంది. నగరంలోని గోవండి ప్రాంతానికి చెందిన సానియా ప్రస్తుతం 11వ తరగతి చదువుతోంది. ఆమె తండ్రి ఓ రిక్షా డ్రైవర్. తల్లి కూలి పనులు చేస్తుంటుంది. ఇప్పుడామె వీడియోలు సోషల్ మీడియా ఐకాన్. యువ ర్యాపర్‌గా ఆమె పేరు ఇప్పుడు అందరికీ సుపరిచితమైంది.

ర్యాప్ మ్యూజిక్‌లో మూడేళ్లుగా సంచలనం సృష్టిస్తున్న సానియాకు సొంత ఫోన్ కూడా లేకపోవడం గమనార్హం. స్నేహితుల ఫోన్లలోనే వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన చుట్టూ, తనలానే పేదరికంతో బాధపడుతున్న ప్రజల సమస్యలను తన వీడియోల్లో హైలైట్ చేస్తున్న సానియా కళ్లలో విజయం సాధించాలన్న తపన, సంకల్పం కొట్టిచ్చినట్టు కనిపిస్తాయి.

 ‘‘అవును నా స్వప్నం చాలా పెద్దది. భగవంతుడి దయవల్ల వాటిని నిజం చేసుకుంటానన్న విశ్వాసం ఉంది’’ అని సానియా నవ్వుతూ చెప్పింది. తాను ఎదుర్కొన్న సమస్యలపై మాట్లాడుతూ.. తానేం చేస్తున్నానో తన తల్లిదండ్రులకు తెలియదని పేర్కొంది. ఇక్కడి ప్రజలకు ర్యాప్ అంటే ఏంటన్నది తెలియదని, కాబట్టి దాని గురించి తాను వారికి చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.

ఆ తర్వాత తన తల్లి కూడా దానిని ఎంతగానో ఇష్టపడిందని పేర్కొంది. తాను ఇంటి నుంచి బయటకు వెళ్లాక తన గురించి ఈ ప్రపంచం ఏం అనుకుంటుందోనని ఆందోళనగా ఉండేదని, కానీ ఇప్పుడు తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు ఉందని వివరించింది. అందుకనే తాను ర్యాపర్‌గా కొనసాగుతున్నట్టు తెలిపింది.

సానియా తన తల్లి ఫోన్‌లో  'saniya_mq' పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తోంది. సానియా తొలిసారి చేసిన బహిరంగ ప్రదర్శన చూసి ఆమె తల్లి ఎంతో సంతోషించినట్టు సానియా సన్నిహితురాలు నస్రీన్ అన్సారి పేర్కొంది.

‘‘సానియా తొలిసారి వేదికపైకి వచ్చినప్పుడు కుమార్తె ప్రదర్శన ఎలా ఉందో చూడమని ఆమె తల్లికి చెప్పాను. అయితే, చుట్టూ ఉన్న ప్రేక్షకులను చూసి తొలుత భయపడింది. కొంతమంది అబ్బాయిలైతే అసభ్యకర వ్యాఖ్యలు కూడా చేశారు. ఆమె ప్రదర్శన ప్రారంభమైన తర్వాత చాలామంది ఆమె ధారావి ర్యాపర్‌లలో ఒకరని కొనియాడారు. సానియా అందరినీ ఆకట్టుకుంది. ఆమె తల్లి దూరం నుంచే కుమార్తె ప్రదర్శనను తిలకించింది’’ అని నస్రీన్ తెలిపింది.

  • Loading...

More Telugu News