Chittoor District: మీడియాను అనుమతించం.. మీరు బయటకు వెళ్లిపోవాలి: జడ్పీ సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి

Please Go outside minister peddireddy asks media
  • చిత్తూరు సర్వసభ్య సమావేశంలో ఘటన
  • మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం
  • దయచేసి వెళ్లిపోవాలని సూచన
  • సమావేశ వివరాలను తర్వాత వెల్లడిస్తామన్న మంత్రి
చిత్తూరు జడ్పీ సర్వసభ్య సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కాబట్టి మీడియా బయటకు వెళ్లిపోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు క్లుప్తంగా వివరిస్తామని తెలిపారు. చిత్తూరు జడ్పీ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. కవరేజీ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎజెండాలోని అంశాలను చర్చించాల్సి ఉందని, కాబట్టి దయచేసి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు బయటకు వెళ్లిపోవాలని జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి కూడా కోరారు. తమను కవరేజీకి అనుమతించాలని విలేకరులు అభ్యర్థించినప్పటికీ నిరాకరించారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి కలగజేసుకుని.. సమావేశ వివరాలను సమాచార శాఖ వెల్లడిస్తుందని పేర్కొన్నారు.

ఈ సమావేశానికి మీడియాను అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దానిని అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు సమావేశ మందిరం నుంచి బయటకు వచ్చేశారు. అయితే, మధ్యాహ్నం దాటినా విలేకరులకు ఆ వివరాలు అందకపోవడం గమనార్హం.
Chittoor District
ZP Genaral Meeting
Peddireddi Ramachandra Reddy
Andhra Pradesh

More Telugu News