చేతకాని వాళ్లు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు?: వైసీపీపై పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు

12-12-2021 Sun 18:23
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • వ్యతిరేకిస్తూ కార్మికుల పోరాటం
  • మద్దతు పలికిన పవన్ కల్యాణ్
  • మంగళగిరిలో ఒకరోజు దీక్ష
  • దీక్ష ముగింపు సందర్భంగా ప్రసంగం
Pawan Kalyan fires on YCP leaders
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో దీక్ష చేపట్టడం తెలిసిందే. దీక్ష ముగింపు సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ, స్టీల్ ప్లాంట్ కార్మికులకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు మద్దతు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకు జనసేన గుర్తొస్తుందని, రేపు ఓటేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకు రావాలంటూ ఛలోక్తి విసిరారు.

వైసీపీకి చెందిన వ్యక్తులు జనసేనకు శత్రువులు కాదని, వారి విధానాలు బాగాలేనప్పుడు మాత్రమే తాము ప్రతిఘటిస్తామని స్పష్టం చేశారు. వైసీపీ నేతలపై తమకు ఎలాంటి ద్వేషం లేదని అన్నారు. తాము ఎప్పుడూ వైసీపీ విధానాలనే ఎత్తిచూపుతాం తప్ప, వైసీపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయబోమని వివరించారు. కానీ వైసీపీ నేతలు అలా కాదని, స్టీల్ ప్లాంట్ అంశం ఏమైందని అడిగితే తమను పచ్చిబూతులు తిడతారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. ఇంట్లోవాళ్లను కూడా తిడతారని తెలిపారు. ఈ సందర్భంగా సభకు వచ్చిన వారు స్పందిస్తూ... "మీరంటే వైసీపీ వాళ్లకు భయం అన్నా" అని పవన్ తో చెప్పారు.

అనంతరం పవన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.... ఓ ప్రాంతంలో పరిశ్రమ వచ్చిందంటే ఆ ప్రాంత అభివృద్ధికి అది సంకేతం అని వివరించారు. "విశాఖ ఉక్కు కేవలం ఓ చిన్న పరిశ్రమ కాదు, ఇది ఆంధ్రుల తాలూకు ఆత్మగౌరవం. దీనికోసం తీవ్ర పోరాటం జరిగింది. ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలం ఇది. ఇవాళ ఆ పరిశ్రమను ప్రైవేటీకరణ అంటే ఆ పోరాటానికి విలువ లేకుండా చేయడమే. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో నేను మోదీతోనూ, బీజేపీతోనూ గొడవపెట్టుకోవాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు.

నేను ఎప్పుడు వెళ్లినా బీజేపీ అగ్రనేతలు ఎంతో గౌరవం ఇస్తారు. వారితో చర్చలు ఎంతో సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో మేం వారితో ప్రస్తావించిన మొదటి అంశం ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలన్నదే. అందుకు బీజేపీ అగ్రనాయకత్వం సమ్మతించబట్టే మేం ముందుకు వెళ్లాం. దీనిపై అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అమరావతే రాజధాని అని తిరుపతిలో చెప్పారు.

ఎవరికైనా మాట మీద నిలబడడం చాలా ముఖ్యం. వైసీపీ వాళ్లు ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు వారు ఏమన్నారో గుర్తుచేసుకోవాలి. ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీ ఢిల్లీకి వెళితే కేంద్ర పెద్దలు ఎంతో గౌరవంగా మాట్లాడుతున్నారు. మరి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్న వైసీపీ ఏంచేస్తోంది? కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడంలేదు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు... మనం అడగకుండా ఉండడంలోనే తప్పుంది.

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ మినీ రత్న కంపెనీని ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమైంది. అప్పుడు మేం టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. అనంతరం దాని ప్రైవేటీకరణ ఆగింది. ఇప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పై వైసీపీ ప్రభుత్వం పోరాడకపోతే కేంద్రం ఎలా స్పందిస్తుంది? మనం ఎన్నికలప్పుడు విడివిడిగా పోటీ పడదాం... కానీ స్టీల్ ప్లాంట్ అంశంలో కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది.

నాకు ప్రజాక్షేత్రంలో ఎంతో బలం ఉంది. నేను సభ ఏర్పాటు చేస్తే లక్షల మంది వస్తారు... కానీ చట్టసభల్లో నేను చాలా బలహీనుడిని. చట్టసభల్లో నాకు బలం ఉంటే నేనే ఢిల్లీ వెళ్లి దీనిపై మాట్లాడేవాడ్ని. వైసీపీలా చేతకానితనంతో కూర్చునేవాళ్లం కాదు. చేతకాని వ్యక్తులు చట్టసభల్లో కూర్చోవడం ఎందుకు? మళ్లీ వీళ్లను చేతకాని వ్యక్తులు అంటే నొచ్చుకుంటారు. వైసీపీ ఎంపీలకు చిత్తశుద్ధి గనుక ఉంటే మీరెవరినీ తిట్టనక్కర్లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం అడ్డుకుంటాం అని ఓ ప్లకార్డును పట్టుకునే దమ్ము మీకుందా?" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.