Ram Gopal Varma: దుబాయ్ లో ఓ పోలీస్ స్టేషన్ ను చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన రామ్ గోపాల్ వర్మ

  • 'లడ్కీ' చిత్ర ప్రమోషన్ కోసం దుబాయ్ వెళ్లిన వర్మ
  • బుర్జ్ ఖలీఫా టవర్స్ లో చిత్ర ప్రమోషన్ ఈవెంట్
  • దుబాయ్ లో స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన వైనం
  • వర్మ వీడియోను పంచుకున్న దుబాయ్ పోలీసులు
Ram Gopal Varma heaps praises on Dubai smart police station

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల దుబాయ్ వెళ్లారు. 'లడ్కీ' చిత్రం ప్రమోషన్ ఈవెంట్ ను దుబాయ్ లోని ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా టవర్స్ లో నిర్వహించగా, ఆ కార్యక్రమంలో వర్మ పాల్గొన్నారు. కాగా, దుబాయ్ పర్యటనలో భాగంగా వర్మ అక్కడ ఓ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి విపరీతమైన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఓ పోలీస్ స్టేషన్ ఇంత అందంగా ఉంటుందని తాను ఏమాత్రం ఊహించలేదని అన్నారు. ఈ మేరకు వర్మ కామెంట్స్ తో కూడిన వీడియోను దుబాయ్ పోలీసులు ఇన్ స్టాగ్రామ్ లో పంచుకోగా, ఆ వీడియోను వర్మ ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో వర్మ మాట్లాడుతూ, దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ను చూస్తుంటే ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చూస్తున్నట్టుగా ఉందని, ప్రతి అంశం అద్భుతంగా ఉందని వివరించారు. భారత్ లో పోలీస్ స్టేషన్లు ఎలా ఉంటాయో, అందుకు పూర్తి విరుద్ధంగా దుబాయ్ స్మార్ట్ పోలీస్ స్టేషన్ ఉందని, ఈ విషయాన్ని తాను కళ్లారా చూశానని తెలిపారు. ఈ పోలీస్ స్టేషన్ ను చూసిన తర్వాత "బ్యూటిఫుల్" అనే మాట ఉపయోగించక తప్పడంలేదని అన్నారు. ఇంత స్మార్ట్ గా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్న పోలీస్ స్టేషన్ ను ఇతర దేశాలు కాపీ కొట్టడం ఖాయమని పేర్కొన్నారు.

More Telugu News