Poonam Khetrapal: ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి: డబ్ల్యూహెచ్ఓ ప్రాంతీయ డైరెక్టర్

WHO Regional Director Poonam Khetrapal opines on Omicran variant
  • థర్డ్ వేవ్ అంచనాలపై డబ్ల్యూహెచ్ఓ రీజనల్ డైరెక్టర్ స్పందన
  • మహమ్మారి ఇంకా అంతం కాలేదన్న పూనమ్ ఖేత్రపాల్
  • కొత్త కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి
  • ఒమిక్రాన్ లక్షణాలు, తీవ్రతపై స్పష్టత లేదని వివరణ
ఒమిక్రాన్ వ్యాప్తి, భారత్ లో థర్డ్ వేవ్ అంచనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ స్పందించారు. మహమ్మారి ఇంకా అంతం కాలేదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని, ప్రపంచదేశాల్లో నేటికీ ఆందోళనకర రీతిలో కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. ఒమిక్రాన్ కొద్దికాలంలోనే ప్రపంచమంతా వ్యాపించడం చూస్తుంటే దీని ప్రభావం తీవ్రస్థాయిలో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు.

అయితే ఈ కొత్త వేరియంట్ ఎలాంటి లక్షణాలు కలిగిస్తుంది? ఇన్ఫెక్షన్ తీవ్రత, విస్తరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉందని, అందుకే ప్రపంచ దేశాలు సహకరించాలని పూనమ్ ఖేత్రపాల్ సూచించారు. అన్ని దేశాలు ఒమిక్రాన్ వేరియంట్ కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని పిలుపునిచ్చారు.

దక్షిణాఫ్రికా నుంచి అందిన సమాచారం మేరకు... ఈ కొత్త వేరియంట్ ద్వారా రీఇన్ఫెక్షన్లు కలుగుతున్నాయని వెల్లడించారు. డెల్టా వేరియంట్ కంటే తక్కువ స్థాయిలోనే లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ, ఇప్పుడిప్పుడే దీనిపై ఎలాంటి అంచనాలకు రాలేమని ఆమె పేర్కొన్నారు.

ఒమిక్రాన్ కారణంగా భారత్ లో థర్డ్ వేవ్ వస్తుందా? అనే అంశంపై కొంత అనిశ్చితి ఉందని తెలిపారు. భారత్ లో కొన్ని వారాల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. భారత్ లో ప్రస్తుతం 30కి పైగా కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి.
Poonam Khetrapal
Omicron
New Variant
India
Third Wave
WHO

More Telugu News