Mon Incident: అమిత్ షా పార్లమెంటులో అబద్ధం చెప్పారు... 'నాగాలాండ్ ఘటన'పై నిరసనకారుల ధ్వజం

Huge protest in Mon district of Nagaland
  • నాగాలాండ్ లో ఇటీవల సైనికుల కాల్పులు
  • 13 మంది సాధారణ పౌరుల మృతి
  • ట్రక్కులో వెళుతున్నవారిని ఉగ్రవాదులుగా భావించిన సైన్యం
  • పార్లమెంటులో ప్రకటన చేసిన అమిత్ షా
  • అమిత్ షా కట్టుకథలు చెబుతున్నారన్న కోన్యాక్ ప్రజలు

వారం కిందట నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో ఉగ్రవాదులుగా పొరబడి సామాన్యులను ఆర్మీ కాల్చిచంపడం తెలిసిందే. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు సైనికులపై దాడికి యత్నించగా, ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో మరో ఏడుగురు మరణించారు. ఓ సైనికుడు కూడా ఈ ఘటనలో మరణించాడు.

కాగా, ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన ప్రకటన నాగాలాండ్ ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. గ్రామస్థులతో కూడిన ట్రక్కును ఆపాలని సైన్యం కోరినా, ఆ ట్రక్కు ఆగకుండా దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగిందని అమిత్ షా వెల్లడించారు. ట్రక్కులో ఉన్నవారు చొరబాటుదారులు అయ్యుంటారని సైనికులు భావించి కాల్పులు జరిపారని వివరించారు.

అయితే, అమిత్ షా ప్రకటనను నిరసిస్తూ మోన్ జిల్లాలో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. వేలమంది ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమిత్ షా దిష్టిబొమ్మను, సైనికుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అమిత్ షా పార్లమెంటులో అబద్ధం చెప్పారని ఆరోపించారు. మోన్ ఘటనపై కట్టుకథ అల్లి, పార్లమెంటులో తప్పుడు ప్రకటన చేశారని మండిపడ్డారు.

సైనికుల కాల్పుల్లో మృతి చెందినవారు కోన్యాక్ తెగ గిరిజనులు. ఈ ఘటనపై ప్రత్యేకంగా సమావేశమైన కోన్యాక్ గిరిజన కూటమి పెద్దలు.... అమిత్ షా తక్షణమే క్షమాపణలు చెప్పాలని, పార్లమెంటులో చేసిన అసత్య ప్రకటనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు సానుభూతి అక్కర్లేదని, న్యాయం కావాలని వారు ముక్తకంఠంతో నినదించారు. తప్పుడు కథనాలతో ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారని గిరిజన కూటమి ఉపాధ్యక్షుడు హోనాంగ్ కోన్యాక్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News