Chandrababu: హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ అవుతుందని చెప్పిన జగన్ ఇప్పుడెందుకు పోరాడడం లేదు?: చంద్రబాబు

  • టీడీపీ అధినేత చంద్రబాబు ప్రెస్ మీట్
  • గతంలో జగన్ వ్యాఖ్యల ప్రస్తావన
  • విభజన హామీలపై జగన్ ఒక్కమాట మాట్లాడడంలేదని విమర్శ 
  • హోదాపై ఇంకెన్నాళ్లు మభ్యపెడతారని ఆగ్రహం
Chandrababu questions CM Jagan on special status

టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రత్యేకహోదాపై సీఎం జగన్ ఎందుకు పోరాడడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోతే రాజీనామా చేస్తానని సీఎం జగన్ గతంలో చెప్పలేదా? హోదా వస్తే రాష్ట్రం మారిపోతుందని అనలేదా? హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించలేదా? అని నిలదీశారు.

విభజన హామీల విషయంలోనూ సీఎం జగన్ ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని విమర్శించారు. రైల్వే జోన్ పై సీఎం జగన్ ఏం చెబుతారని ప్రశ్నించారు. అటు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అంశం గురించి సీఎం జగన్ కు ముందే తెలుసని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక పరిశ్రమ మాత్రమే కాదని, ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని ఉద్ఘాటించారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్న వైసీపీ సర్కారుపై క్రమంగా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ప్రజలే ప్రభుత్వంపై తిరగబడడం ఖాయమని వ్యాఖ్యానించారు.

ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, మరి వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా? అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. హోదాపై ఇంకెన్నాళ్లు ప్రజల్ని మోసగిస్తారని ప్రశ్నించారు.

More Telugu News