Andhra Pradesh: పది లక్షల్లో ముగ్గురికి వచ్చే వ్యాధి.. గుర్తించలేకపోయిన అమెరికా వైద్యులు.. జబ్బేంటో పట్టేసిన గుంటూరు జీజీహెచ్ వైద్యులు!

  • అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న గుంటూరు యువకుడు 
  • కాళ్లూచేతులు చచ్చుబడిపోవడంతో మంచానికి పరిమితం
  • వెన్నెముకలో ఇన్ ఫెక్షన్ అని తేల్చిన అమెరికా నిపుణులు
  • జీజీహెచ్ కు తీసుకొచ్చిన తల్లిదండ్రులు
  • వారంపాటు ఇన్ పేషెంట్ గా చేర్చుకున్న వైద్యులు
  • ‘పాలియో సిండ్రోమ్’ అనే అరుదైన వ్యాధిగా గుర్తింపు
Guntur GGH Doctors Find a Rare Disease In Youth which Is not even Possible to US Experts

పది లక్షల్లో ముగ్గురికి మాత్రమే వచ్చే వ్యాధి అది. అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా మంచి స్థానంలో ఉన్న 25 ఏళ్ల గుంటూరు యువకుడికి ఆ వ్యాధి వచ్చింది. కూర్చుంటే లేవలేకపోవడం, లేస్తే కూర్చోలేకపోవడం వంటి ఇబ్బందులు. అక్కడి ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా లాభం లేకపోయింది. ఎన్నెన్నో పరీక్షలు చేసినా.. ఆ వ్యాధి ఏంటన్నది అక్కడి వైద్యులు తేల్చలేకపోయారు. చివరకు వెన్నెముకలో ఇన్ ఫెక్షన్ ఉందని తేల్చేసి ఇంటికి పంపించేశారు. అయితే, పరిస్థితి మరింత ముదిరింది. కాళ్లూచేతులు చచ్చుబడి మంచానికి పరిమితం చేసింది.

కానీ, అమెరికా వైద్యులూ గుర్తించలేని ఆ జబ్బును గుంటూరు సమగ్ర ప్రభుత్వ వైద్యశాల వైద్యులు నిర్ధారించి తామేంటో నిరూపించారు. కాళ్లూచేతులు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్న యువకుడిని తల్లిదండ్రులు అమెరికా నుంచి గుంటూరు జీజీహెచ్ కు తీసుకొచ్చారు. ఆ యువకుడిని ఇన్ పేషెంట్ గా ఉంచుకుని వారంలోనే ఆ జబ్బేంటో వైద్యులు పసిగట్టేశారు. చేతులు పైకి లేపలేకపోవడం, పొట్టలో నీళ్లు చేరడం, బొడ్డు వాపు, చేతుల్లో కండపోయి చచ్చుపడడం వంటి లక్షణాలను గమనించారు. ‘పాలియో సిండ్రోమ్’ అనే అరుదైన జబ్బు అని ఆ యువకుడిని పరీక్షించిన న్యూరాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్వీ సుందరాచారి నేతృత్వంలోని వైద్యులు నిర్ధారించారు.
 
ఇది బ్లడ్ కేన్సర్ లాంటిదేనని డాక్టర్ సుందరాచారి చెప్పారు. ప్లాస్మా సెల్స్ నుంచి మైలోమా ప్రొటీన్ (ఎంప్రొటీన్) ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, ఒక శాతం లోపు ఉండాల్సిన ఈ హానికారక ఎంప్రొటీన్.. యువకుడిలో 10 శాతం కన్నా ఎక్కువుందన్నారు. ఎంప్రొటీన్ ఎక్కువగా ఉంటే బ్లడ్ కేన్సర్ కు సంకేతాలని చెప్పారు. కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి ద్వారానే దానిని నివారించగలుగుతామని తెలిపారు.

కాగా, తన 25 ఏళ్ల కెరీర్ లో ఈ కేసు తొలిదని చెప్పారు. ప్రతి పదిలక్షల్లో ముగ్గురికి మాత్రమే వస్తుందన్నారు. దీనిని ఇటీవల గుంటూరు న్యూరో క్లబ్ లో ప్రదర్శించామని సుందరాచారి చెప్పారు. ఎంతో లిటరేచర్ స్టడీ చేసి జబ్బును గుర్తించగలిగామని వెల్లడించారు. రెండేళ్ల పాటు ఇంట్లో నుంచే పనిచేయడం వల్ల కాళ్లూచేతులు పట్టేసినట్టు అనిపించినా.. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎఫెక్ట్ తో ఇలా జరిగి ఉంటుందని యువకుడు భావించాడని వైద్యులు చెప్పారు.

More Telugu News